Viral Video : సంప్రదాయం అంటే ఇదేనబ్బా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎడ్లబండి బారాత్ వీడియో

Viral Video : ఉత్తరప్రదేశ్ లోని దేవరియాలో ఎడ్లబండిపై జరిగిన వింత బారాత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లగ్జరీ కార్లను కాదని సంప్రదాయ పద్ధతిలో ఊరేగింపు నిర్వహించిన వరుడిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Update: 2026-03-17 04:48 GMT

Traditional Wedding

Viral Video : ఈ రోజుల్లో పెళ్లి అంటే చాలు.. కోట్ల రూపాయల ఖర్చు, ఖరీదైన లగ్జరీ కార్లు, హెలికాప్టర్ ఎంట్రీలు కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ హోదాను ప్రదర్శించుకోవడానికి ఫార్చ్యూనర్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి వాహనాలను వాడుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని దేవరియా జిల్లాలో జరిగిన ఒక పెళ్లి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధునిక పోకడలను పక్కన పెట్టి, మన పాతకాలపు సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఒక పెళ్లికొడుకు ఏకంగా ఎడ్లబండిపై బారాత్ తీశాడు. ఈ అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

దేవరియాలో జరిగిన ఈ వేడుకలో వరుడు, అతని బంధువులు అందంగా అలంకరించిన ఎడ్లబండ్ల మీద ఊరేగింపుగా వెళ్లారు. ఎడ్లబండ్లకు రంగురంగుల బట్టలు, పూలతో అలంకరించి, వాటిపై పెళ్లి సామాగ్రిని ఉంచారు. ఒకప్పుడు గ్రామాల్లో వాహనాలు లేని సమయంలో ఇలాగే ఎడ్లబండ్లపై బారాత్ వెళ్లేది. ఇప్పుడు మళ్ళీ ఆ జ్ఞాపకాలను కళ్ళకు కట్టినట్లు ఈ వీడియో చూపిస్తోంది. ఆధునిక కాలంలో ఇంత సాదాసీదాగా, కానీ ఎంతో అర్థవంతంగా పెళ్లి చేసుకోవడం చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో deoria_wale_bhaiya అనే ఐడి ద్వారా పోస్ట్ చేయగా, దీనికి రికార్డు స్థాయిలో స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల (5 మిలియన్ల) మంది ఈ వీడియోను చూశారు. అలాగే 2 లక్షల 76 వేల మందికి పైగా దీనిని లైక్ చేశారు. కమెంట్ల విభాగంలో అయితే రచ్చ మొదలైంది. "ఈ బారాత్ ముందు ఎంతటి లగ్జరీ కారైనా దిగదుడుపే" అని ఒకరు రాస్తే, "దీనివల్ల డబ్బు ఆదా అవ్వడమే కాకుండా కాలుష్యం కూడా ఉండదు, మన సంస్కృతిని కాపాడుకున్నట్లవుతుంది" అని మరొకరు పేర్కొన్నారు.

మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. "నేను కూడా నా పెళ్లిని ఇలాగే చేసుకోవాలని అనుకుంటున్నాను" అని తమ మనసులో మాట బయటపెట్టారు. నేటి తరం యువత కూడా పాతకాలపు పద్ధతులపై ఆసక్తి చూపిస్తుండటం విశేషం. ఈ వీడియో ద్వారా మన మూలాలను మర్చిపోకూడదనే సందేశాన్ని దేవరియా ప్రజలు చాటిచెప్పారు. నిజంగానే పాతకాలపు ఆడంబరం లేని అందం ఈ బారాత్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News