Viral News : టైం బాగా లేకుంటే అంతే.. రైలు ఢీకొట్టిన దుంగ మహిళపైకి దూసుకెళ్లిన భీకర దృశ్యం
టైం బాగా లేకుంటే అంతే.. రైలు ఢీకొట్టిన దుంగ మహిళపైకి దూసుకెళ్లిన భీకర దృశ్యం
Viral News : బీహార్‌లో గుండెల్ని పిండేసే రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పక్కన నిలబడటమే ఆ మహిళ చేసిన పాపమైంది. వేగంగా దూసుకొచ్చిన రైలు, ట్రాక్‌పై ఉన్న కలప దుంగలను బలంగా ఢీకొనడంతో జరిగిన విధ్వంసం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పు పొడవాల్సిందే. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.
బీహార్‌లోని పహార్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. అక్కడ రైల్వే ట్రాక్ పక్కనే కలప దుంగలను అక్రమంగా నిల్వ చేశారు. నిబంధనల ప్రకారం ట్రాక్‌కు చాలా దూరంలో ఉండాల్సిన ఈ మొద్దులు, నిర్లక్ష్యం కారణంగా పట్టాలకు అతి సమీపంలోకి వచ్చాయి. అదే సమయంలో ఒక ప్రయాణికుల రైలు వేగంతో ఆ మార్గంలో దూసుకొచ్చింది. ట్రాక్‌పై దుంగలు ఉన్న విషయాన్ని డ్రైవర్ గమనించేలోపే ఘోరం జరిగిపోయింది.
రైలు ఇంజిన్ ఆ భారీ కలప దుంగలను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఒక భారీ కలప మొద్దు గాల్లోకి లేచి, అక్కడే ట్రాక్ దాటేందుకు వేచి చూస్తున్న ఒక మహిళపైకి దూసుకెళ్లింది. ఆ మొద్దు బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అప్పటివరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. ఆ మహిళకు తల, శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం కేవలం నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రయాణికుల రైళ్లలో కలపను అక్రమంగా ఎలా తరలిస్తున్నారు? ట్రాక్ పక్కనే అంత భారీ ఎత్తున మొద్దులను ఎలా నిల్వ చేశారని రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఒక అమాయకురాలి ప్రాణం ప్రమాదంలో పడిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. రైల్వే ట్రాక్ సమీపంలో నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో మరోసారి హెచ్చరిస్తోంది.