ఇంటిముందు వృద్ధుడు గొయ్యి తవ్వుతుంటే అనుమానించిన పొరుగువారు.. చివరికి వెలుగులోకి వచ్చిన దారుణం..!
Haryana: హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ మృతదేహం, పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఆమె అత్తవారింటి ముందున్న గొయ్యిలో లభ్యమవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
ఇంటిముందు వృద్ధుడు గొయ్యి తవ్వుతుంటే అనుమానించిన పొరుగువారు.. చివరికి వెలుగులోకి వచ్చిన దారుణం..!
Haryana: హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ మృతదేహం, పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఆమె అత్తవారింటి ముందున్న గొయ్యిలో లభ్యమవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన తనూ (24) అనే యువతి, రెండు సంవత్సరాల క్రితం ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్‌కు చెందిన అరుణ్ అనే వ్యక్తితో వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత భర్త, అత్తమామలతో కలిసి ఫరీదాబాద్‌లోనే జీవనం కొనసాగిస్తున్న ఆమె, పెళ్లి అయిన నాటి నుంచే శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొంటూ వచ్చినట్లు తనూ సోదరి ప్రీతి మీడియాతో పేర్కొంది.
డబ్బు, నగలు తీసుకురావాలని ఆమేయు అత్తింటి వారు ఒత్తిడి పెడుతూ వేధింపులకు గురిచేసేవారని ఆమె తెలిపింది. పరిస్థితులు తాళలేక, పెళ్లైన రెండు నెలలకే తనూ తల్లిదండ్రుల ఇల్లు చేరిందని, దాదాపు ఏడాది పాటు అక్కడే ఉన్నారని వెల్లడించింది. కానీ తిరిగి అత్తింటికి పంపించిన తర్వాత మళ్లీ వేధింపులు మొదలయ్యాయని, మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని వాపోయింది.
ఏప్రిల్ 9న తనూ ఫోన్ చేయడంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కాంటాక్ట్ కాలేదని, వెంటనే పోలీసులు, అధికారులను ఆశ్రయించినా స్పందన లేదని ఆరోపించారు. ఏప్రిల్ 23న తనూ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె మామ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
అయితే, తనూ మృతదేహం దొరికిన గొయ్యిని ఆమె మామ స్వయంగా తవ్వాడని స్థానికులు వెల్లడించారు. “నీరు పోయేందుకు తవ్వుతున్నానని మాకు చెప్పాడు. ఆ తరువాత గొయ్యిని పూడ్చేశాడు” అని వారు తెలిపారు. అప్పటికే తమకు అనుమానాలు వచ్చినా, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేకపోయామన్నారు.
ఈ ఘటనపై ఫరీదాబాద్ డీసీపీ ఉషా కుండూ స్పందిస్తూ, వారం క్రితం ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. మృతదేహాన్ని గొయ్యిలోంచి బయటకు తీసినట్టు చెప్పారు. ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, మృతదేహాన్ని ఫారెన్సిక్ పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. మరణ కారణాలు, సమయం తెలుసుకునే పనిలో ఉన్నామని పేర్కొన్నారు.