Wind energy: ఏపీని అనుసరిస్తున్న గుజరాత్!

Wind energy: ఆంధ్ర విద్యుత్ సంస్కరణల్లో భాగంగా పీపీఏలను రద్దు చేయడంతో కేంద్రం కాస్త ఇబ్బందులు పడిందనే సంగతి అందరికీ తెలిసిందే.

Update: 2020-07-11 03:43 GMT
Wind energy Gujarat government following Andhra Pradesh to cancell PPA in wind energy

Wind energy: ఆంధ్ర విద్యుత్ సంస్కరణల్లో భాగంగా పీపీఏలను రద్దు చేయడంతో కేంద్రం కాస్త ఇబ్బందులు పడిందనే సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై పలుమార్లు రాష్ట్రానికి లేఖలు సైతం రాసింది. వీటి వల్ల భవిషత్తులో ఇబ్బందులు వస్తాయంటూ హెచ్చరించింది. అయితే తాజాగా ఆంధ్ర మాదిరిగానే గుజరాత్ ప్రభుత్వం పీపీఏల రద్దు విషయంలో ముందుకు పోతుంది. ఇలా ఒకదాని వెంబడి ఒకటి వీటి విధానాన్ని పున:సమీక్షించడం వల్ల కేంద్రం ఏం చేస్తేందో వేచి చూడాల్సిందే.

చౌక విద్యుత్‌కే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ బాటను గుజరాత్‌ కూడా అనుసరిస్తోంది. ఎక్కువ ధర చెల్లించే పాత విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏల)ను గుజరాత్‌ తాజాగా రద్దు చేసింది. ఈ పీపీఏల్లో పెద్ద పెద్ద ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. అంతకు ముందు ప్రభుత్వం ఈ పీపీఏలను చేసుకుంది. విదేశీ బొగ్గుతో నడిచే థర్మల్‌ ప్లాంట్లకు వేరియబుల్‌ కాస్ట్‌ (చర వ్యయం) రోజురోజుకు పెరుగుతోంది. ఇది డిస్కమ్‌లకు భారంగా మారిందని గుజరాత్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్కువ టారిఫ్‌ ఉన్న పీపీఏలను సమీక్షించాలని 2019 జూన్‌లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం విద్యుత్‌ నియంత్రణ మండలి పరిధిలో ఉంది.

శాపంలా పాత పీపీఏలు..

టీడీపీ సర్కారు అధికారంలో ఉండగా అడ్డగోలుగా అత్యధిక టారిఫ్‌తో పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. 2015 నుంచి 2019 వరకు 13,794 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను అవసరం లేకున్నా కొనుగోలు చేయడంతో డిస్కమ్‌లపై రూ.5,497.3 కోట్ల అదనపు భారం పడింది. పాత పీపీఏల కారణంగా ఇప్పటికీ ఏటా రూ. 2 వేల కోట్లు అదనంగా విద్యుత్‌ కొనుగోలుకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

► 2016–17లో పవన, సౌర విద్యుత్‌ను 2,433 మిలియన్‌ యూనిట్లు (5%) కొనాల్సిన అవసరం ఉంటే 4,173 ఎంయూలు (8.6%) కొనుగోలు చేశారు. 2017–18లో 4,612 (9%) ఎంయూలకు బదులు 9,714 (19%) ఎంయూలు కొన్నారు. 2018–19లో 6,190 (11%) ఎంయూలు కొనాల్సి ఉంటే 13,142 (23.4 శాతం) ఎంయూలు కొనుగోలు చేశారు.

► ప్రస్తుతం సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.3 లోపే లభిస్తుండగా టీడీపీ సర్కారు కుదుర్చుకున్న పీపీఏల వల్ల యూనిట్‌కు గరిష్టంగా రూ. 5.96 వరకూ చెల్లించాల్సి వస్తోంది. పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ. 4.84 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. భవిష్యత్తులో రేట్లు మరింత తగ్గినా పీపీఏలున్న ప్రైవేట్‌ సంస్థలకు ఇదే రేట్లు చెల్లించాల్సి రావడం డిస్కమ్‌లకు గుదిబండగా మారుతోంది.

► రాష్ట్రంలో గత ప్రభుత్వం అత్యధిక టారిఫ్‌ ఇచ్చేలా 47 సౌర విద్యుత్‌ పీపీఏలు చేసుకుంది. పవన విద్యుత్‌ పీపీఏలు ఇలాంటివి 220 వరకూ ఉన్నాయి. 2014కు ముందు పవన విద్యుత్‌ పీపీఏలు 88 మాత్రమే ఉన్నాయి.

ఆదర్శంగా ఏపీ అడుగులు..

డిస్కమ్‌లను పీల్చి పిప్పిచేసి గత సర్కారు హయాంలో విద్యుత్‌ చార్జీలు పెరగడానికి కారణమైన కొనుగోలు ఒప్పందాలపై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమీక్ష చేపట్టింది. కమిటీ వేసి వాస్తవాలు రాబట్టింది. పీపీఏల వెనుక గుట్టు రట్టవుతుందనే భయంతో విపక్షాలు ప్రైవేట్‌ ఉత్పత్తిదారులతో చేతులు కలిపి అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కోర్టు సూచనలతో ఏపీఈఆర్‌సీ అధిక ధరలున్న పీపీఏలపై విచారణ జరపాల్సి ఉంది. ఏదేమైనా ఏపీ ముందడుగు వేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

Tags:    

Similar News