రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పొలిటికల్ లింక్స్... హీరోయిన్ వెనకున్న ఆ పొలిటీషియన్ ఎవరు?

Update: 2025-03-07 01:30 GMT

రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఏంటి? ఈ హీరోయిన్ వెనకున్న పొలిటీషియన్ ఎవరు?

రన్యా రావు... ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ఈ కన్నడ హీరోయిన్ పేరే వినిపిస్తోంది. సినిమాలు చేసి సంపాదించుకున్న పేరు కంటే గోల్డ్ స్మగ్లింగ్ చేసి వార్తల్లోకెక్కడం వల్లే ఎక్కువ అన్‌పాపులర్ అయ్యారు.

అసలు ఎవరీ రన్యా రావు? ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేస్తోందని పోలీసులకు ఎలా తెలిసింది? అంత పెద్ద మొత్తంలో గోల్డ్‌తో ఆమె ఏం చేస్తోంది? ఆమె అరెస్టుకు ముందు, ఆ తరువాత ఏం జరిగిందనేదే ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీ.

Full View

అది సోమవారం రాత్రి...

బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్...

దుబాయ్ నుండి వచ్చే విమానం కోసం డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ సిబ్బంది వెయిట్ చేస్తున్నారు.

ఆ విమానంలోనే రన్యా రావు దుబాయ్ నుండి బెంగళూరుకు వస్తున్నారు.

ఈ ఏడాదిలో ఆమె ఇలా పదిసార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లొచ్చారు.

ఇంతకీ ఈ రన్యా రావు ఏం చేస్తున్నారు?

ఎందుకు ఇంత తక్కువ గ్యాప్‌లో గల్ఫ్ దేశాలకు వెళ్లొస్తున్నారు?

కొన్నిరోజుల్లోనే పదిసార్లు విదేశాలకు వెళ్లి వచ్చేంత అవసరం ఆమెకు ఏముంది?

గల్ఫ్ వెళ్లొచ్చిన ప్రతీసారి ఆమె ఒకే రకమైన డ్రెస్సింగ్ సెన్స్‌లో కనిపిస్తున్నారు. ఇందులో ఏమైనా మర్మం ఉందా?

ఇలా రకరకాల ప్రశ్నలు, ఆలోచనలు వారి మైండ్ తొలిచేస్తున్నాయి.

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూడటం లేదనుకున్నట్లుగా రన్యా రావు కూడా రెగ్యులర్‌గా గల్ఫ్ దేశాలకు వెళ్లొస్తున్నారు. తనని ఎవ్వరూ గమనించడం లేదనుకున్నారు. కానీ వాస్తవానికి ఎయిర్ పోర్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ఆమెను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అందుకే సోమవారం రాత్రి ఆమె వస్తున్న విమానం కోసం వెయిట్ చేస్తున్నారు.

దుబాయ్ ఫ్లైట్ లోంచి రన్యా రావు దిగారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు ఆమెను కస్టమ్స్ చెకింగ్ వద్ద ఆపేశారు.

రన్యా రావు చాలా కాన్ఫిడెంట్‌గా, అసలు తప్పే చేయనట్లుగా ధీమాగా కనిపించారు. కానీ ఆమెను చెకింగ్ చేసి చూశాకా షాక్ అవడం అధికారుల వంతయ్యింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా తనిఖీల్లో బయటపడింది. తన జీన్స్ లాంటి దుస్తులు కింద ఈ బంగారాన్ని దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె వద్ద నుండి మొత్తం రూ. 17 కోట్లు 30 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

రన్యా రావును మంగళవారం కోర్టు ఎదుట హాజరపర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఎవరీ రన్యా రావు?

రన్యా రావు పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. కన్నడ స్టార్ హీరో సుదీప్‌తో కలిసి మాణిక్య అనే సినిమాలో నటించారు. తెలుగులో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన పటాస్ సినిమాను కన్నడలో పటాకీ పేరుతో రీమేక్ చేశారు. అందులో కూడా రన్యా రావు హీరోయిన్‌గా చేశారు. అలా ఇంకొన్ని సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

ఆమె పిన తండ్రి కే రామచంద్ర రావు కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. తన మొదటి భార్య చనిపోయిన తరువాత ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. ఆయన రెండో భార్యగా వచ్చిన మహిళకు అప్పటికే పెళ్లయి ఇద్దరు కూతుళ్లున్నారు. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒకరే ఈ రన్యా రావు.

పిన తండ్రి ఐపీఎస్ ఆఫీసర్ కావడంతో ఆయన పేరు చెప్పుకునే ఈమె ఎయిర్‌పోర్టులో ఫ్రిస్కింగ్ నుండి తప్పించుకుంటున్నట్లు తెలిసింది. సీనియర్ బ్యూరోక్రాట్స్‌కు, ఐపీఎస్ ఆఫీసర్లకు తనిఖీ చేసే చోట ఫ్రిస్కింగ్ చేయకుండా పంపించేందుకు ప్రోటోకాల్ ఉంది.

తన పినతండ్రికి ఎయిర్ పోర్ట్ అధికారులు ఇచ్చే ఆ ప్రోటోకాల్‌ను రన్యా రావు ఉపయోగించుకున్నారు. ఆమెకు ప్రోటోకాల్ విభాగంలోని ఎవరో అధికారి సాయం చేస్తున్నారని డిఆర్ఐ అధికారులు గ్రహించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లొచ్చిన ప్రతీసారి ఫ్రిస్కింగ్ లేకుండా ఆమె బయటకు రావడం, ఆమెను ఒక ప్రభుత్వ వాహనం వచ్చి పికప్ చేసుకుని వెళ్లడం జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఇంతకీ ఆ గోల్డ్‌తో ఆమె ఏం చేస్తున్నారు?

సోమవారం రాత్రి అరెస్ట్ చేసిన అనంతరం మంగళవారం ఆమె ఇల్లు, ఇతర ప్రదేశాల్లో పోలీసులు సోదాలు జరిపారు. అక్కడ కూడా 2 కోట్ల 10 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దొరికాయి. అంతేకాకుండా 2 కోట్ల 70 లక్షల రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక పేరు మోసిన పొలిటీషియన్ తరపున ఆ బంగారం కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అయితే, అంత పెద్ద మొత్తంలో బంగారానికి డబ్బులు ఎలా చెల్లించారు, ఆ డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు.

బెంగుళూరులో ఒక పెద్ద స్మగ్లింగ్ సిండికేట్‌తో రన్యా రావు చేతులు కలిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఇలా రెగ్యులర్‌గా విదేశాలు వెళ్లి వచ్చి ఉంటారనేది వారి అనుమానం. అంతేకాదు... గతంలో విదేశాలకు వెళ్లొచ్చిన నాలుగుసార్లు కూడా ఇలాంటి గెటప్‌లోనే తిరిగి రావడంతో అప్పుడు కూడా గోల్డ్ స్మగ్లింగ్ చేసే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పాత వివాదంలో పినతండ్రి పేరు

ఈ ఘటనతో ఐపీఎస్ ఆఫీసర్ కే రామచంద్ర రావు కూడా వార్తల్లోకెక్కారు. 2014 లో ఆయన కర్ణాటక దక్షిణ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్నప్పుడు ఆయన ఒక వివాదంలో చిక్కుకున్నారు. తన వద్ద రూ. 2 కోట్ల నగదు సీజ్ చేసి అధికారిక లెక్కల్లో మాత్రం కేవలం 20 లక్షలే చూపించారంటూ కేరళకు చెందిన ఒక జువెలరీ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఇదో పెద్ద వివాదమైంది.

ఈ కేసును దర్యాప్తు చేసిన సీఐడి అధికారులు.. రామచంద్ర రావు గన్‌మ్యాన్ ఆ నగదు దోపిడీ చేసినట్లు గుర్తించారు. తాజాగా రన్యా రావు స్మగ్లింగ్ కేసుతో అప్పటి ఆ వివాదం ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతోంది.

కూతురు రన్యా రావు విషయమై ఆయన మాట్లాడేందుకు ఇష్టపడలేదు. "4 నెలల క్రితమే రన్యాకు పెళ్లి జరిగింది. అప్పటి నుండి ఆమె మాతో టచ్‌లో లేదు. ఆమె భర్త జతిన్ హుక్కెరి పబ్‌లకు, మైక్రోబ్రేవరీస్‌కు ఆర్కిటెక్‌గా పనిచేస్తున్నారు. అంతకు మించి తనకు ఇంకే వివరాలు తెలియదు" అని రామచంద్ర రావు చెబుతున్నారు. ముందు నుండి ఆమెతో డిస్టన్స్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు. కానీ తన కూతురు ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదని రావు తెలిపారు.

విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్

రన్యా రావు స్మగ్లింగ్ వెనుక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ నాయకుడు ఎవరో బయటపెట్టాలంటూ కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టిన నివేదిక అందించాల్సిందిగా ఆదేశించామని కర్ణాటక హోంశాఖ మంత్రి జి పరమేశ్వర తెలిపారు.

గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లర్స్ దొరకడం ఇదేం కొత్త కాదు. కానీ రన్యా రావు కేసు మాత్రం వేరే లెవెల్లో కనిపిస్తోంది. ఒక కిలో బంగారం స్మగ్లింగ్‌కు ఆమె లక్ష వరకు చార్జ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అన్నింటికిమించి విమానంలో ఒక స్మగ్లర్ ఒకేసారి ఇంత భారీ మొత్తంలో గోల్డ్ తీసుకొస్తూ దొరికిపోయిన దాఖలాలు కూడా లేవని తెలుస్తోంది. అయితే, ఆమె చేత స్మగ్లింగ్ చేయిస్తోన్న ముఠా ఎవరు? ఏ రాజకీయ నాయకుడి తరుపున ఆమె అంత బంగారం కొనుగోలు చేశారు అనే లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. 

Tags:    

Similar News