Udayanidhi: హిందీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము: ఉదయనిధి స్టాలిన్
Udayanidhi: జాతీయ విద్యా విధానం ముసుగులో బలవంతంగా హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం హిందీని ఇంపోజ్ చేయాలని ప్రయత్నిస్తే..మరో భాష యుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. హిందీ వల్ల అనేక ఉత్తర భారత మాతృభాషలు తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి డీఎంకే భయపడబోదని తేల్చి చెప్పేశారు. డీలిమిటేషన్, ఎన్ఈపీ, హిందీ భాషను అనుమతించబోమని ఖరాఖండిగా చెప్పారు.
కేంద్రం తమిళనాడుపై హిందీని రుద్దాలని యోచిస్తోందని..హర్యానా, బీహార్, యూపీ రాష్ట్రాల్లో హిందీని రుద్దడం వల్ల వాటి మాతృభాషలు కనుమరుగయ్యాయని అన్నారు. ఇటీవల సీఎం స్టాలిన్ మూడు విషయాలు చెప్పారు. ఎన్ఈపీ, డీలిమిటేషన్, త్రిభాషా విధానాన్ని అంగీకరించబోము. కేంద్రం హిందీ భాషను విధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కొత్త విద్యావిధానం ద్వారా ఈ కుట్రకు తెరలేపింది. తమిళనాడు కొత్త విద్య విధానాన్ని ఎప్పుడూ అంగీకరించదు. కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రస్తుత పాలన ఏఐఏడీఎంకేది కాదని డీఎంకేది అని తెలిపారు.