Vijay Mallya: మాల్యా కేసులో బ్యాంకులకే లండన్ కోర్టు మద్దతు
Vijay Mallya: మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాలన్న బ్యాంకుల వాదనను లండన్ కోర్టు సమర్థించింది.
Vijay Mallya:(File Image)
Vijay Mallya: వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన ముఖ వ్యాపారవేత్త విజయ మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాలన్న బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎగవేత సొమ్మును రాబట్టే ప్రయత్నంలో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మరింత ముందంజ వేసింది. లండన్ హైకోర్టులో ఇవాళ విజయ్ మాల్యాకు చుక్కెదురైంది. మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాలంటూ ఎస్బీఐ తదితర బ్యాంకుల కన్సార్టియం తమ గత పిటిషన్ కు సవరణ కోరాయి. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ సమర్థించారు.
మాల్యా కేసుకు సంబంధించి నేడు వర్చువల్ విధానంలో విచారణ చేపట్టారు. భారత్ లోని మాల్యా ఆస్తులపై బ్యాంకుల సెక్యూరిటీ మొత్తాల మాఫీకి జడ్జి మైఖేల్ బ్రిగ్స్ మార్గం సుగమం చేశారు. భారత్ లో ఇలాంటి సెక్యూరిటీ మొత్తాల మాఫీని నిలువరించే విధానమేదీ లేదని బ్యాంకులకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. తుది విడత వాదనలు వినేందుకు జూలై 26న తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది.