Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ ప్రయాణికులకు షాక్.. 8 గంటలు దాటితే టికెట్ డబ్బులు పోయినట్టే

వందేభారత్ స్లీపర్ రైలులో టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలు కఠినం. ప్రయాణానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే రిఫండ్ ఉండదు.

Update: 2026-01-19 13:10 GMT

Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ ప్రయాణికులకు షాక్.. 8 గంటలు దాటితే టికెట్ డబ్బులు పోయినట్టే

Vande Bharat Sleeper:  దేశంలో వందేభారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభమైన నేపథ్యంలో టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలపై రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే వందేభారత్ స్లీపర్ రైలులో టికెట్ రద్దు ఛార్జీలు మరింత కఠినంగా ఉండనున్నాయి.

సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణానికి నాలుగు గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసుకుంటే కొంత మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వందేభారత్ స్లీపర్ రైలులో ప్రయాణానికి ఎనిమిది గంటల కంటే తక్కువ సమయం మిగిలి ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా రిఫండ్ ఇవ్వబోమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా రైల్వే ప్యాసింజర్స్ రూల్స్–2015ను సవరించినట్లు తెలిపింది.

రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వందేభారత్ స్లీపర్ టికెట్‌ను 72 గంటల కంటే ముందే రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం కోత విధిస్తారు. 72 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే 50 శాతం మొత్తాన్ని క్యాన్సిలేషన్ ఛార్జీగా వసూలు చేస్తారు. ప్రయాణానికి 8 గంటల లోపు ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదు.

అలాగే వందేభారత్ స్లీపర్ రైలులో ఆర్‌ఏసీ (RAC) సదుపాయం ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణికులకే ఈ రైలులో ప్రయాణానికి అనుమతి ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ లేదా పాక్షికంగా కన్ఫామ్ అయిన టికెట్లకు అవకాశం ఉండదు.

ఈ రైలులో అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 60 రోజులుగా ఉండగా, మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు కోటా అందుబాటులో ఉంటుంది. 45 ఏళ్లు దాటిన మహిళలకు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు లోయర్ బెర్త్‌లను సిస్టమ్ ఆటోమేటిక్‌గా కేటాయిస్తుందని రైల్వే శాఖ పేర్కొంది. 400 కిలోమీటర్లలోపు ప్రయాణానికి కూడా కనీసం థర్డ్ ఏసీకి రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.

Tags:    

Similar News