One Rupee Shoe Offer : ఒక్క రూపాయికే బ్రాండెడ్ షూ.. వింత ఆఫర్ కోసం ఎగబడ్డ జనం...పోలీసుల లాఠీఛార్జ్

One Rupee Shoe Offer : కోజికోడ్ లో ఒక్క రూపాయికి షూస్ ఆఫర్ ప్రకటించడంతో 20 వేల మంది యువకులు తరలివచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, షాపు యజమానిని అరెస్ట్ చేశారు.

Update: 2026-03-09 01:26 GMT

One Rupee Shoe Offer

One Rupee Shoe Offer : రూపాయికి మంచినీళ్ల ప్యాకెట్ కూడా రాని ఈ రోజుల్లో.. బ్రాండెడ్ షూస్ వస్తాయంటే ఎవరైనా ఆగుతారా? ఆ ఆశతో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. చివరకు షూస్ మాట దేవుడెరుగు కానీ.. పోలీసుల లాఠీ దెబ్బలు మాత్రం ఫ్రీగా దొరికాయి. కేరళలోని కోజికోడ్ నగరంలో ఒక చిన్న అడ్వర్టైజ్‌మెంట్ పెను సంచలనానికి దారితీసింది. కేవలం ఒక్క రూపాయకే బ్రాండెడ్ షూస్ ఇస్తామంటూ ఒక దుకాణదారుడు ఇచ్చిన ఆఫర్ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు పోలీసులు లాఠీలకు పనిచెప్పే వరకు వెళ్లింది. కోజికోడ్ లోని మనంచిరా ప్రాంతంలో ఉన్న ట్రెండ్స్ ఫ్యాక్టరీ అనే కొత్త షూ షాపు యజమాని సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఈ రచ్చకు కారణమైంది.

ఒక్క రూపాయి నోటుకు బ్రాండెడ్ షూస్

షాపు ప్రారంభోత్సవం సందర్భంగా యజమాని ఒక వింత ఆఫర్ ప్రకటించాడు. ఎవరి దగ్గరైనా పాత ఒక్క రూపాయి నోటు ఉంటే, అలాంటి వారు మొదట వచ్చిన 100 మందికి బ్రాండెడ్ షూస్‌ను కేవలం ఒక్క రూపాయకే ఇస్తామని ప్రకటించాడు. ఈ వార్త సోషల్ మీడియాలో సెకన్ల మీద వైరల్ కావడంతో కోజికోడ్ వాసులే కాకుండా వయనాడ్, త్రిశూర్, మంగళూరు వంటి పక్క జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో యువకులు అక్కడికి క్యూ కట్టారు. కొందరైతే తెల్లవారుజామున 2 గంటలకే షాపు ముందుకు చేరుకోవడం విశేషం.

జనసంద్రాన్ని తలపించిన రోడ్లు

ఆదివారం ఉదయం 7 గంటల కల్లా సుమారు 20,000 మంది యువకులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. షాపు తలుపులు తీయగానే జనం ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతోందని గమనించిన పోలీసులు జనాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ యువకులు వినకపోవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ తోపులాటలో, పోలీసుల చర్యలో పలువురు యువకులకు గాయాలయ్యాయి.

షాపు యజమాని అరెస్ట్

ముందస్తు అనుమతి లేకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటించి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. షాపు యజమానితో పాటు మరో ఎనిమిది మంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన అనుమతులు, భద్రతా ఏర్పాట్లు లేకుండా షాపును మళ్లీ తెరవకూడదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క రూపాయి ఆఫర్ కాస్తా చివరకు జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News