Viral Video : డ్యాన్స్ చేస్తే దేశం నుంచి పంపేస్తారా? అమెరికాలో భారతీయుడి వీడియోపై రచ్చ
Viral Video : అమెరికాలోని రెండో ప్రపంచ యుద్ధ స్మారకం వద్ద డ్యాన్స్ వీడియో తీసిన భారత సంతతి వ్యక్తి మధు రాజుపై డిపోర్టేషన్ ముప్పు పొంచి ఉంది. అధికారులు దీన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.
Immigration News
Viral Video : అమెరికాలో ఉంటున్న ఒక భారత సంతతి వ్యక్తి చేసిన పని ఇప్పుడు అతడిని చిక్కుల్లో పడేసింది. వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మకమైన రెండవ ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వద్ద మధు రాజు అనే వ్యక్తి ఒక మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తూ టిక్‌టాక్ వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడటంతో ఇప్పుడు అతను దేశం విడిచి వెళ్లాల్సిన (డిపోర్టేషన్) పరిస్థితి నెలకొంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలర్పించిన 4 లక్షల మంది అమెరికన్ సైనికులకు గుర్తుగా, 1.6 కోట్ల మంది సేవలకు నివాళిగా ఈ మెమోరియల్‌ను నిర్మించారు. అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రదేశాన్ని మధు రాజు ఒక డ్యాన్స్ సెట్‌లా మార్చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. "మా తాతగారు ఈ యుద్ధంలో పాల్గొని తూటా దెబ్బలు తిన్నారు.. ఇది స్మరించుకోవాల్సిన చోటు కానీ, రీల్స్ చేసుకునే షూటింగ్ స్పాట్ కాదు" అంటూ ఒకరు ఆగ్రహం వ్యక్తం చేయగా, విదేశాలకు వెళ్లే భారతీయులకు అక్కడి మర్యాదలు, పౌర విద్యపై కచ్చితంగా శిక్షణ ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు.
అధికారులు ఏమంటున్నారు?
అమెరికా చట్టాల ప్రకారం, వీసాపై ఉన్న వ్యక్తులు అక్కడి నిబంధనలను ఉల్లంఘించినా లేదా అనుచిత ప్రవర్తనతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా వారి వీసాను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. సాధారణంగా డ్యాన్స్ చేయడం నేరం కాకపోయినప్పటికీ, అనుమతి లేకుండా ఫెడరల్ మాన్యుమెంట్స్ వద్ద ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించడం చట్టవిరుద్ధం. మధు రాజు చేసిన ఈ పని అతని వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా? అనే కోణంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదే నిజమైతే అతడిని భారత్‌కు పంపించే అవకాశం ఉంది.
Indian couple working in the United States on H-1B visas went to the World War II Memorial in Washington DC and danced there amid the ongoing war between Iran and the United States.
— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) March 5, 2026
Indians 😭😭 pic.twitter.com/6LqS0azLm6
మద్దతుగా నిలుస్తున్న మరికొందరు
అయితే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భారత సంతతి వ్యక్తులు మధు రాజుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇది భారతీయ సంస్కృతిని చాటి చెప్పడమేనని, సంతోషాన్ని పంచుకోవడంలో తప్పేముందని వాదిస్తున్నారు. ఒక రీల్ చేసినంత మాత్రాన చట్టాన్ని అతిక్రమించినట్లు ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా, విదేశాల్లో ఉండే మన వాళ్లు అక్కడి చట్టాలను, భావోద్వేగాలను గౌరవించకపోతే ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.