Flight Cancelled : గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి అలర్ట్.. 279 అంతర్జాతీయ విమానాలు బంద్

Flight Cancelled : పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా 279 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా మార్చి 10 నుంచి 78 అదనపు విమానాలను నడపనుంది.

Update: 2026-03-09 01:45 GMT

Middle East Conflict 279 International Flights Cancelled

Flight Cancelled : మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల గగనతలం మూసివేయడం, ఆంక్షలు విధించడంతో విమానాల రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. దీని ప్రభావం భారతీయ విమానయాన సంస్థలపై తీవ్రంగా పడింది. ఆదివారం ఒక్కరోజే వివిధ భారతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుమారు 279 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అస్థిరత వల్ల విమానాల మెయింటెనెన్స్ కత్తిమీద సాములా మారిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పర్యాటకుల అవస్థలు

యుద్ధ వాతావరణం కారణంగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆదివారం భారీ ఎత్తున విమానాలు నిలిచిపోయాయి. మొత్తం 66 విమానాలు రద్దు అయ్యాయి. అందులో 34 విమానాలు బయలుదేరాల్సినవి, 32 విమానాలు రావాల్సినవి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం నాడు 51 విమానాల్లో సుమారు 8,175 మంది ప్రయాణికులు పశ్చిమ ఆసియా నుంచి క్షేమంగా భారత్ చేరుకోగలిగారు. అయితే ఆదివారం పరిస్థితి మరింత దారుణంగా మారడంతో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి సంస్థలు తమ సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది.

ప్రయాణికుల కోసం అదనపు విమానాలు

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపేందుకు ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 10 నుంచి 18వ తేదీ వరకు తొమ్మిది అంతర్జాతీయ రూట్లలో 78 అదనపు విమానాలను నడపాలని నిర్ణయించింది. దుబాయ్, అబుదాబి, మస్కట్, జెడ్డా వంటి నగరాల నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎయిర్‌లైన్స్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. సోమవారం (మార్చి 9) నాడు కూడా సుమారు 50 విమానాలను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

టికెట్ ధరలపై ప్రభుత్వం నిఘా

యుద్ధం పేరుతో విమాన టికెట్ల ధరలను అడ్డగోలుగా పెంచకుండా పౌర విమానయాన శాఖ నిఘా పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను దోచుకోకుండా చూడాలని ఎయిర్‌లైన్స్ సంస్థలను ఆదేశించింది. ఇతర విమానాశ్రయాల్లోని పరిస్థితులను బట్టి మరిన్ని అదనపు సర్వీసులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లు లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News