US Visa Policy: అమెరికా కొత్త నిబంధనలతో విద్యార్థులకు షాక్.. భారతీయులలో కలకలం!

అగ్రరాజ్యం అమెరికా తాజాగా తీసుకొచ్చిన వీసా ప్రతిపాదన భారతీయ విద్యార్థుల్లో తీవ్ర కలవరం రేపుతోంది..

Update: 2025-07-02 15:30 GMT

US Visa Policy: అమెరికా కొత్త నిబంధనలతో విద్యార్థులకు షాక్.. భారతీయులలో కలకలం!

US Visa Policy:  అగ్రరాజ్యం అమెరికా తాజాగా తీసుకొచ్చిన వీసా ప్రతిపాదన భారతీయ విద్యార్థుల్లో తీవ్ర కలవరం రేపుతోంది. ఇప్పటివరకు ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ (D/S) విధానాన్ని రద్దు చేసి, ప్రతి స్టూడెంట్ వీసాకు స్పష్టమైన గడువును నిర్ణయించాలన్న ప్రతిపాదనను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ చర్చలోకి తీసుకొచ్చారు. కొత్త విధానం ప్రకారం, ప్రతి విదేశీ విద్యార్థి అమెరికాలో ఉన్న గడువు పూర్తయ్యే తేదీకి ముందుగా దేశం విడిచిపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది వలసలను నియంత్రించేందుకు తీసుకొస్తున్న కఠిన చర్యగా చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే ఉన్న విధానంలో విద్యార్థులు తమ విద్యాభ్యాసం కొనసాగుతున్నంతవరకూ వీసా గడువు గురించి ఆందోళన లేకుండానే అమెరికాలో ఉండే వీలుండేది. కానీ, ఈ ప్రతిపాదన అమలవుతే వారి విద్యను గడువుతో కట్టిపెట్టేలా మారుతుందనే ఆందోళన విద్యార్థుల్లో ఉంది. ముఖ్యంగా F-1 (విద్యార్థుల), J-1 (విజిటింగ్ స్కాలర్స్, మీడియా ప్రతినిధులు) వీసాలపై ఉన్నవారికి ఇది భారీ దెబ్బగా మారనుంది.

ఈ ప్రతిపాదనను ట్రంప్ మొదటిసారి 2020లో తన అధ్యక్ష కాలంలో సూచించినప్పటికీ, ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) దీనిని సిద్ధం చేసింది. త్వరలోనే దీన్ని మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ కార్యాలయానికి సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ప్రజల అభిప్రాయం కోసం 30–60 రోజుల గడువును కల్పించే అవకాశం ఉంది. అత్యవసరమైతే నేరుగా అమల్లోకి తీసుకురావచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

అమెరికాలో ప్రస్తుతం ఉన్న 3.3 లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థుల్లో చాలామంది భారతీయులే. ఈ ప్రతిపాదన అమలైతే వారి భవిష్యత్తుపై బలమైన ప్రభావం పడే ప్రమాదం ఉంది. విద్యా సంస్థలు ఇప్పటికే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది విద్యార్ధుల అభ్యాసాన్ని తీవ్రంగా అంతరాయం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నాయి.

ఈ పరిణామాలు భారతీయ విద్యార్థుల్లో గుబులు పెంచుతుండగా, అమెరికాలో ఉన్నవారిలో భవిష్యత్తు అనిశ్చితిగా మారుతోంది.

Tags:    

Similar News