Real Story: అప్పు చేసి కొడుకును అమెరికా పంపించారు... 8 నెలల్లో రెండుసార్లు డిపోర్టేషన్
Real Story: అప్పు చేసి కొడుకును అమెరికా పంపించారు... 8 నెలల్లో రెండుసార్లు డిపోర్టేషన్
US Deportations real story: అమెరికా డిపోర్టేషన్ ఫ్లైట్స్ ఇండియాకు వస్తుండటంతో ఆ డాలర్ డ్రీమ్స్ వెనుకున్న కన్నీటి గాథలెన్నో ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా తరన్వాలా గ్రామానికి చెందిన కశ్మీర్ సింగ్ అనే ఒక వ్యక్తి రియల్ స్టోరీ కూడా అలానే వెలుగుచూసింది. పంజాబ్ నుండి అక్రమమార్గాల్లో అమెరికా వెళ్లేందుకు కలలు కంటున్న వారి జీవితాలు ఎలా ఇబ్బందుల్లో పడుతున్నాయనేది ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చెబుతోంది.
కశ్మీర్ సింగ్‌ది స్వీట్స్ హౌజ్ బిజినెస్. ఆయన కొడుకు నవ్‌దీప్ సింగ్ వయస్సు 21 ఏళ్ళు. ఫిరోజ్‌పుర్‌లో గురు నానక్ కాలేజ్‌లో డిగ్రీ చేశారు. అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండే వారు. తండ్రి చేస్తున్న వ్యాపారమే చేయడానికి నవదీప్‌కు మనసొప్పుకోలేదు. తనలాగే కొడుకు చేత స్వీట్స్ వ్యాపారం చేయించడం ఆ తండ్రికి కూడా ఇష్టం లేదు. కొడుకు చదువుకు తగ్గట్టుగా ఏదైనా ఉద్యోగం చేస్తే చూడాలనుకున్నారు.
అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలన్నది నవ్‌దీప్ సింగ్ కల. అదే విషయం తండ్రికి చెప్పారు. కొడుకు కోసమే ఆరాటపడిన ఆ తండ్రి కూడా అది తనకు శక్తికిమించిన భారమే అయినా కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయారు.
తమలానే అమెరికా కలలు కనే వారిని అమెరికా పంపించే ఒక ట్రావెల్ ఏజెంట్‌ను కలిశారు. ఆ ఏజెంట్ రూ. 40 లక్షలు డిమాండ్ చేశారు. ఊర్లో ఎకరం భూమి అమ్మేశారు. అయినా అంత డబ్బురాలేదు. బంధువులు, ఊర్లో తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు తెచ్చారు. నవ్‌దీప్ అమెరికా ప్రయాణానికి బయల్దేరారు.
నవ్‌దీప్ అమెరికా వెళ్లాలనుకున్నది చట్టపరంగా కాదు. చాలామంది పంజాబీలు దొంగచాటుగా వెళ్లే డుంకీ రూట్‌లోనే ఆ యువకుడు అమెరికా ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో పనామా దేశాన్ని దాటాల్సి ఉంటుంది. పనామాలో ఉండగానే నవ్‌దీప్ అక్కడి అధికారులకు దొరికిపోయారు. అక్కడి నుండి వారు ఇండియాకు వెనక్కు పంపించారు.
రెండోసారి అమెరికా ప్రయాణం
నవ్‌దీప్ ఇంటికొచ్చారు కానీ అమెరికా కల అలాగే ఉంది. 2 నెలలు ఇంట్లోనే ఉన్నారు. ఈసారి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోసారి ఏజెంట్‌ను కలిశారు. ఈసారి మరో రూ 15 లక్షలు అడిగారు. అవి కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో మొత్తం రూ. 55 లక్షలైంది.
ఎలాగోలా రెండు నెలల క్రితం తను అమెరికా చేరుకున్నట్లు నవ్‌దీప్ సింగ్ ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. కానీ వారాల వ్యవధిలోనే నవ్‌దీప్‌ను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. జనవరి 27న నవ్‌దీప్‌ను అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అప్పటి నుండి పంజాబ్‌లో ఉన్న తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. తమ కొడుకు ఏమయ్యారో, ఎక్కడున్నారో తెలియక కశ్మీర్ సింగ్ కుటుంబం ఆందోళనలో పడింది. అక్రమంగా పంపించారు కనుక ఎవరిని, ఏం అడగాలో అర్థం కాని పరిస్థితి.
అమెరికా నుండి ఫోన్
కశ్మీర్ సింగ్ కుటుంబం ఈ ఆందోళనతో తల్లడిల్లుతుడగానే రెండు రోజుల క్రితం అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి ఫోన్ వచ్చింది. మీ కొడుకును అక్రమవలసదారుడిగా పట్టుకున్నామని ఫోన్ చేశారు. అమెరికా నుండి వస్తోన్న రెండో విమానంలో ఇండియాకు పంపిస్తున్నామని సమాచారం అందించారు.
కొడుకు బతికే ఉన్నాడనే సంతోషం కొంత... భూమి అమ్మి, అప్పు చేసి ఇంత కష్టపడి రెండుసార్లు అమెరికా పంపిస్తే రెండుసార్లు తిరిగి ఇంటిబాట పట్టాల్సి వచ్చిందనే బాధ ఇంకొంత. 8 నెలల వ్యవధిలోనే రెండుసార్లు అమెరికా కల చెదిరిపోయింది. అప్పులే మిగిలాయి. ఆ కుటుంబం పరిస్థితి చూస్తోంటే చాలా బాధగా ఉందని తరన్వాల సర్పంచ్ అమర్ చాంద్ అంటున్నారు. పంజాబ్‌లో ఇది ఒక్క కశ్మీర్ సింగ్ కథ కాదు... ఇలా ఎంతోమంది యువత అడ్డదారిలో అమెరికా బాటపడుతున్నారు. మార్గం మధ్యలోనో లేక అమెరికాలోనో దొరికిపోయి ఇలా ఇబ్బందులు పడుతున్నారు.
REAL STORY: అమెరికా విమానం కోసం పోలీసులు రెడీగా ఉన్నారు... దిగగానే ఇద్దరినీ అరెస్ట్ చేశారు
WATCH THIS VIDEO: Modi meets Donald Trump: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?
WATCH THIS VIDEO: అమెరికా ఎంత మంది భారతీయుల్ని వెనక్కి పంపించిందో తెలుసా? | Trump Immigration Policy | hm డిజిటల్
REAL STORY: 10 రోజుల క్రితమే రూ. 90 లక్షలు ఖర్చుపెట్టి అమెరికా వెళ్లారు... అప్పుడే తిప్పి పంపించారు