మహారాష్ట్రలో రైలు ప్రమాదం: 8 మంది మృతి, 40 మందికి గాయాలు
Train runs over Pushpak Express passengers in Maharashtras Jalgaon
మహారాష్ట్ర జల్‌గావ్ వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. సుమారు 40 మందికిపైగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని పుష్పక్ వద్ద రైలు నిలిచిపోయింది. మంటలు వ్యాపించాయనే ప్రచారంతో కొందరు చైన్ లాగారు. దీంతో రైలు ఆగిపోయింది. రైలు నిలిచిపోయిన సమయంలో పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పైకి వచ్చారు. అయితే అదే సమయంలో అదే ట్రాక్ పై కర్ణాటక ఎక్స్ ప్రెస్ వచ్చింది. ట్రాక్ పై ఉన్న ప్రయాణీకులను ఢీకొంటూ రైలు వెళ్లింది. దీంతో ఈ ట్రాక్ పై ఉన్న ప్రయాణీకుల్లో 8 మంది మరణించారు.
ముంబై వైపు వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ పార్ధాడే రైల్వే స్టేషన్ సమీపంలో ఆగింది. ట్రాక్ పనులు జరుగుతున్నందున రైలు ఆగింది. అయితే ఆ సమయంలో నిప్పురవ్వలు కన్పించాయని వదంతులు వ్యాపించాయి. దీంతో రైలులోని ప్రయాణీకులు కిందకు దూకారు. అదే సమయంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
భుశవాల్ డివిజనల్ రైల్వే మేనేజర్, మెడికల్ టీమ్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సహాయక బృందం సంఘటన స్థలానికి హుటాహుటిన బయలుదేరారు.ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. మంత్రి గిరీష్ మహాజన్ , జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి వెళ్లారని ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.సంఘటన స్థలానికి ఎనిమిది అంబులెన్స్ లు చేరుకున్నాయి. గాయపడినవారికి చికిత్స అందిందచేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది చేరుకున్నారని సీఎం తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని ఆయన వివరించారు.