Mallojula Venugopal: మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల
Mallojula Venugopal: మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ బుధవారం ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.
Mallojula Venugopal: మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ బుధవారం ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. తనతో పాటు సుమారు 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల బృందాన్ని సీఎం ఫడణవీస్ సాదరంగా స్వాగతించారు.
సాయుధ ఉద్యమం బలహీనపడుతున్న నేపథ్యంలో, మావోయిస్టు పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు.
కొంతకాలంగా మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ వైఖరిని ప్రశ్నిస్తూ బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే, పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే బాధ్యుడినని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పొలిట్‌బ్యూరో నుంచి కూడా ఆయన వైదొలిగారు. తాజాగా, ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు నమోదై ఉన్నాయి.
తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు ప్రేరణ పొందారు. చదువు పూర్తయిన అనంతరం అన్న పిలుపు మేరకు ఆయన ఉద్యమంలో చేరారు. పార్టీలో ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక్ వంటి పేర్లతో పిలిచేవారు. గడ్చిరోలి పోలీసులు మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ప్రకటించారు.