Odisha Storm : ఒడిశాలో గాలివాన బీభత్సం.. ఛిన్నాభిన్నమైన 12 గ్రామాలు.. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం

Odisha Storm : ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో భారీ తుపాను కారణంగా ఇద్దరు మృతి చెందగా, 200 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Update: 2026-03-16 02:10 GMT

Odisha Storm

Odisha Storm : ఒడిశా రాష్ట్రంలోని మయూర్ భంజ్ జిల్లాలో ఆదివారం అకస్మాత్తుగా సంభవించిన భీకర తుపాను అల్లకల్లోలం సృష్టించింది. పెను గాలులతో కూడిన ఈ వాతావరణ బీభత్సం కారణంగా ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సుమారు 12 గ్రామాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఎటు చూసినా కూలిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ఇళ్లతో ఆ ప్రాంతమంతా యుద్ధ భూమిని తలపిస్తోంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవే (NH-220) పై ప్రయాణిస్తున్న సమయంలో గాలివాన తీవ్రతకు పి.నాయక్ (54), మాలతీ మహంత్ (45) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం కెందుఝర్ మెడికల్ కాలేజీకి తరలించారు. వీరితో పాటు మరో 40 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు వల్ల దాదాపు 200లకు పైగా ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళం, పోలీసులు, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగాయి. ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. నిరాశ్రయులైన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం గండం ఇంకా పొంచి ఉంది. సోమవారం కూడా మయూర్ భంజ్ జిల్లాలో పిడుగులు, వడగళ్ల వాన పడే అవకాశం ఉన్నందున అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే సుందర్‌గఢ్, కెందుఝర్, బాలాసోర్, భద్రక్ జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. రాయగడ, కోరాపుట్, గంజాం వంటి దక్షిణ ఒడిశా జిల్లాల్లో కూడా బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News