Top 6 News @ 6 PM: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: మరో 5 ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
1. మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు శక్తి యాప్: అనిత
మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు శక్తి యాప్ ను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి. అనిత చెప్పారు. మార్చి 8న యాప్ ను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. దిశ చట్టంపై ఏపీ శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అడిగిన ్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.
2. సైనిక సాయం నిలిపివేసిన అమెరికా: మండిపడ్డ ఉక్రెయిన్
రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ కు సైనిక సాయం నిలిపివేయాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా ముందే వాదనలకు దిగిన రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. శాంతి స్థాపన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా తెలిపింది. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ మండిపడింది. రష్యాకు లొంగిపోయేలా అమెరికా తమపై ఒత్తిడి తెస్తోందని ఉక్రెయిన్ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్ మెరెజ్ కో ఆరోపించారు.
3. రాష్ట్రాల వైఫల్యాల వల్లే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహం: సుప్రీంకోర్టు
రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహంగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ధరలకు మందుల విక్రయంపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తమ దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేయాలని రోగులను బలవంతపెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. తక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో మందులు దొరికితే ప్రైవేట్ ఆసుపత్రుల్లోని మెడికల్ షాపుల్లోనే రోగులు మందులను ఎందుకు తీసుకోవాలని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా గైడ్ లైన్స్ ను రూపొందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
4. ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదం: రెస్క్యూలో పురోగతి
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూలో పురోగతి చోటు చేసుకుంది. టన్నల్ లో కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేశారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. ఇది రిపేర్ కావడంతో టన్నెల్‌లోని బురదను త్వరగా బయటకు తీసుకువచ్చేందుకు అవకాశం లభిస్తోంది. 11 రోజులుగా సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. కానీ, ఇక్కడ చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం కాలేదు. టన్నెల్ లో ఉబికివస్తున్న నీటి ఊటత సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది.
5. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు వయో పరిమితిని పెంచారు. నాన్ యూనిఫామ్ ఉద్యోగులకు 34 నుంచి 42 ఏళ్లకు, యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితిని రెండేళ్లకు పెంచారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే నియామాకాలకు సంబంధించి ఈ వయోపరిమితి పెంపు వర్తించనుందని ప్రభుత్వం తెలిపింది.
6. త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన: లక్ష్మణ్
త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని ఆ పార్టీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. దేశంలోని 11 రాష్ట్రాలకు ఇప్పటికే అధ్యక్షులను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే దక్షిణాదికి బీజేపీ అధ్యక్ష పదవి అనే చర్చ పార్టీలో జరగలేదని ఆయన అన్నారు. గతంలో దక్షిణాదికి చెందిన నాయకులు రెండుసార్లు పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహించారని ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.