Top 6 News @ 6 PM: కిన్నెర అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ, మరో 5 ముఖ్యాంశాలు

సన్యాసినిగా మారిన మమత కులకర్ణి కిన్నెర అఖాడా నుంచి బహిష్కరించారు. మహామండలేశ్వర్ గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు.

Update: 2025-01-31 12:25 GMT

Top 6 News @ 6 PM: కిన్నెర అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ, మరో 5 ముఖ్యాంశాలు

1. నేను కొడితే మామూలుగా ఉండదు: కేసీఆర్

తాను కొడితే మామూలుగా ఉండదు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటు అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్ లో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పైప్రజలకు అసంతృప్తి వచ్చిందన్నారు. నాలుగు నెలలైతే జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. రియల్ ఏస్టేట్ పడిపోయిందని ఆయన అన్నారు.కాంగ్రెస్ వాళ్లు కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారన్నారు. తాను ఎన్నో ప్రభుత్వాలను చూశానని.. కానీ, ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏది లేదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

2. బ్రిక్స్ దేశాలపై ట్రంప్ ఆగ్రహం

అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాలర్ కు ప్రత్యామ్నాయం చూసుకుంటే బ్రికస్ దేశాల ఎగుమతులపై 100 శాతం విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. డాలర్ కు బదులుగా మరో ఉమ్మడి కరెన్సీని తీసుకురావాలని 2024 అక్టోబర్ లో బ్రిక్స్ సమావేశంలో రష్యా అధ్యక్షులు పుతిన్ ప్రతిపాదించారు.

3. కిన్నెర అఖాడా నుంచి మమత కులకర్ణి బహిష్కరణ

సన్యాసినిగా మారిన మమత కులకర్ణి కిన్నెర అఖాడా నుంచి బహిష్కరించారు. మహామండలేశ్వర్ గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. మతపెద్దలు, అఖాడాల నుంచి అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.అఖాడాలో చేర్పించిన కిన్నెర అఖాడా ఆచార్య మహమండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి తొలగించారు. అఖాడాలోని అత్యున్నతమైన మహామండలేశ్వర్ హోదా ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

4. ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్: లోకేశ్

ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన వెంటనే డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై టీచర్ల అభిప్రాయాలను తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. టీచర్ల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా కొత్త చట్టం తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు.

5. అందుకే విద్యా శాఖ నా వద్దే ఉంది: రేవంత్ రెడ్డి

విద్యాశాఖను వేరేవారికి కేటాయిస్తే ప్రాధాన్యతలు మారుతాయనే కారణంగానే తన వద్దే ఉంచుకున్నానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం షాద్ నగర్ నియోజకవర్గంలోని మొగిలిగిద్ద స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ గ్రామానికి రూ. 16 కోట్లు మంజూరు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

6. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతల స్వీకరణ

ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ద్వారకా తిరుమల రావు నుంచి హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితం హరీశ్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా ఏపీ ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News