Top 6 News @ 6 PM: మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఏది పడితే అది మాట్లాడుతారా?: అల్హాబాదియాపై సుప్రీం ఆగ్రహం

రణ్‌వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అతడి మెదడులోని మలినాన్ని బయటపెట్టాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Update: 2025-02-18 12:31 GMT

1.మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఏది పడితే అది మాట్లాడుతారా?: అల్హాబాదియాపై సుప్రీం ఆగ్రహం

రణ్‌వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అతడి మెదడులోని మలినాన్ని బయటపెట్టాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేకాదు రణ్ వీర్ వక్రబుద్దిని కూడా సూచిస్తున్నాయని తెలిపింది. మాట్లాడే స్వేచ్ఛ ఉందనే పేరుతో సామాజిక నిబంధనలకు విరుద్దంగా ఏది పడితే అది మాట్లాడడానికి ఎవరు అనుమతించారని కోర్టు ప్రశ్నించింది.

అల్హాబాదియాపై నమోదైన ఎఫ్ఐఆర్ లను ఎందుకు కొట్టేయాలని జడ్జి ప్రశ్నించారు. ఆయన వాడిన పదాలు సమాజం సైతం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. పాపులారిటీ కోసం అలాంటి పదాలు వాడినట్టు కోర్టు అభిప్రాయపడింది. అల్హాబాదియాతో పాటు ఆయన స్నేహితులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రదర్శన ఇవ్వవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

2. జెలెన్ స్కీ‌తో చర్చలకు పుతిన్ ఓకే

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యుద్దంపై ఈ ఇద్దరు అవసరం అనుకుంటే చర్చించుకుంటారని క్రెమ్లిన్ తెలిపింది. సౌదీ అరేబియాలో రష్యాతో అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. 2022 నుంచి రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఈ యుద్ధం ఆపుతానని ట్రంప్ ప్రకటించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దిశగా ఆయన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రష్యాతో అమెరికా చర్చలు ప్రారంభించింది.

3. బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి: కేటీఆర్

కులగణన పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ లో నిర్వహించిన రైతు మహా ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. కులగణనలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనతో ఏ వర్గం సంతోషం లేదన్నారు. కేసీఆర్ హయంలో రైతులు రాజుగా బతికారని.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రుణ మాఫీ పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు.

4.అన్యాయం చేసిన అధికారులు, నాయకులను బట్టలూడదీసి నిలబెడతాం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఇందుకు వల్లభనేని వంశీ అరెస్ట్ నిదర్శనమని ఆయన అన్నారు. మంగళవారం వల్లభనేని వంశీని విజయవాడ జైలులో జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వంశీపై కక్షతో ఈ కేసు బనాయించారని ఆయన ఆరోపించారు. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారని జగన్ గుర్తు చేశారు. అన్యాయం చేసిన అధికారులు, నాయకులను బట్టలూడదీసి నిలబెడతానని జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. చట్టం ముందు నిలబెడతామని న్యాయం జరిగేలా చేస్తామన్నారు.

5.ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాలపరిమితి పొడిగింపు

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి డాక్టర్ షమీమ్ అక్తర్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2024 నవంబర్ 11న అక్తర్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 10న గడువు ముగిసింది. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు.నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా: మమత బెనర్జీ

6.నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా: మమత బెనర్జీ

బంగ్లాదేశ్ ఛాందసవాదులతో చేతులు కలిపినట్టు రుజవు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు.మంగళవారం బెంగాల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. విద్వేషాలను వ్యాప్తి చేయడానికి ప్రజల్ని విభజించేందుకు వాక్ స్వాతంత్ర్యం అనుమతించదన్నారు. మతాన్ని రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటుందని ఆయన అన్నారు.


Tags:    

Similar News