Top 6 News @ 6PM: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ, మరో 5 ముఖ్యాంశాలు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. శుక్రవారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు.
1. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. శుక్రవారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని కొంతకాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు.
2. అతనికి సైఫ్ పై దాడితో సంబంధం లేదు: ముంబై పోలీసులు
సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ దాడితో సంబంధం లేదని ముంబై పోలీసులు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరినీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితుడిని పోలీసులు బాంద్రాలో అరెస్ట్ చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తికి ఈ కేసుతో సంబంధం లేదని విచారణలో పోలీసులు గుర్తించారు. మరో వైపు ఈ ఘటనకు అండర్ వరల్డ్ గ్యాంగ్ తో ఎలాంటి సంబంధం లేదని హోంమంత్రి యోగేష్ కదం మీడియాకు చెప్పారు.
సైఫ్ అలీఖాన్ పై గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి దిగారు. సీసీటీవీలో దాడికి దిగిన వ్యక్తిని గుర్తించారు. బాంద్రా రైల్వే స్టేషన్ లోని సీసీటీవీల్లో అతడిని గుర్తించారు. బాంద్రా పోలీసులు శుక్రవారం ఉదయం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ పై దాడి కేసులో అతడిని అనుమానించారు. ఈ విషయమై ఆయనను ప్రశ్నించారు.
దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ను లీలావతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు ప్రకటించారు.
3. అఫ్జల్ గంజ్ కాల్పులు: అమిత్ గ్యాంగ్ కోసం 8 పోలీస్ బృందాలు
హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో కాల్పులకు దిగిన అమిత్ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బీదర్ లో ఏటీఎంలో క్యాష్ వెహికల్ గార్డులను కాల్చి దోపీడికి పాల్పడిన ఇద్దరు దుండగులు అఫ్జల్ గంజ్ లోని ప్రైవేట్ ట్రావెల్స్ లో రాయ్ పూర్ వెళ్లేందుకు టికెట్లు తీసుకున్నారు. ఈ ట్రావెల్స్ యజమాని ఇద్దరు బ్యాగ్ లను చెక్ చేయగా నిందితుల్లో ఒకరు తుపాకీతో కాల్పులకు దిగి పారిపోయారు. వీరిద్దరూ ఆటోలో ట్యాంక్ బండ్ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వారి కోసం 8 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
4. జనవరి 3 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు సాగుతాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారు.
5. ఇమ్రాన్ ఖాన్‌కు అల్‌ఖాదిర్ కేసులో 14 ఏళ్ల జైలు
ఇమ్రాన్ ఖాన్ కు ఆల్ ఖాదిర్ కేసులో ఆయనతో పాటు ఆయన భార్య బుష్రా బీబీ దోషులుగా తేల్చింది కోర్టు. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయన భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లండన్ లో ఉంటున్న పాకిస్తాన్ వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ పాక్ కు పంపితే ఆ సొమ్మును ఇమ్రాన్ ఖాన్ దంపతులు దుర్వినియోగం చేశారనేది ఆరోపణ. ఈ కేసును ఆల్‌ఖాదిర్ ట్రస్ట్ కేసుగా పిలుస్తారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. ఆయనపై 200కి పైగా కేసులు నమోదయ్యాయి. రాజకీయ కక్షతోనే తనపై కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.
6. రైతులకు రుణమాఫీ చేశారని నిరూపిస్తే రాజీనామా: కేటీఆర్
రైతులకు రుణమాఫీ చేశారని నిరూపిస్తే తనతో పాటు తమ పార్టీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్లలో రైతు దీక్షల శుక్రవారం ఆయన పాల్గొన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆయన కోరారు.