Top 6 News @ 6 PM: 'రేవంత్ కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు': మరో 5 ముఖ్యాంశాలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఆరోపించారు.
Top 6 News @ 6 PM: 'రేవంత్ కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు': మరో 5 ముఖ్యాంశాలు
Top 6 News of The Day 13th February 2025
1.రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు: ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణ
కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఆరోపించారు. తొర్రూరు మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 100 సీట్లు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని ఆయన అన్నారు.
2. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. కిడ్నాప్,దాడి కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ 140(1), 308,351(3), రెడ్‌విత్ 3 (5) కింద వంశీపై కేసు నమోదైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న దాడి జరిగింది.ఈ కేసులో వంశీ ఏ 71గా ఉన్నారు. ఈ ఘటనపై గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. రెండు మూడు రోజుల క్రితం సత్యవర్ధన్ ఈ పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. సత్యవర్ధన్ కన్పించకుండా పోయారని ఆయన కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారించారు.
3.పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయ పన్ను బిల్లు
కొత్త ఆదాయ పన్ను బిల్లును లోక్‌సభలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య మంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. ఈ బిల్లును లోక్ సభ సెలెక్ట్ కమిటీ పంపనుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో కొత్త ఆదాయ పన్ను చట్టం తెస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
4.అమెరికాలో బర్డ్‌ఫ్లూ: పెరిగిన కోడిగుడ్ల ధరలు
అమెరికాలో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగానే కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కోడిగుడ్ల కోసం వెళ్లిన వారికి నో స్టాక్ బోర్డులు కన్పిస్తున్నాయి. ఒక్కరికి మూడు కంటే ఎక్కువ గుడ్లు ఇవ్వడం లేదు.2024 జనవరిలో డజన్ కోడిగుడ్ల ధర 2.52 డాలర్లుంటే అది ఇప్పుడు 7.34 డాలర్లకు చేరింది.
5. ఫాంమ్‌హౌస్‌లో కోడిపందెం కేసు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు
మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు గురువారం నోటీసులు ఇచ్చారు. తనకు అందించిన నోటీసులకు సంబంధించి పోలీసులకు సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి లీగల్ నోటీసులు ఇస్తానని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 14న రాత్రి ఫామ్ హౌస్ లో పోలీసులు దాడి చేశారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. రూ. 30 లక్షల నగదు 50 కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
6. పీఎఫ్ వడ్డీ 8.25 శాతమే
ఈపీఎఫ్ ఖాతాల్లో ఉన్న నిల్వలపై పాత వడ్డీ రేటే కొనసాగే అవకాశం ఉంది. 2024-25 సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ 8.25 శాతం ఇవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి 28న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించాలి. అప్పుడే ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అవుతోంది.