నేడు దేశవ్యాప్తంగా చక్కా జామ్
* రహదారులను దిగ్బంధించాలని రైతు సంఘాల పిలుపు * ఢిల్లీలో మూడంచెల భద్రత ఏర్పాటు * ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్‌లకు మినహాయింపు
చక్క జాం (ఫైల్ ఇమేజ్)
రైతులు వెనక్కి తగ్గరు. కేంద్రం మెట్టు దిగదు. సమస్యలుంటే సవరిస్తామని కేంద్రం చట్టమే సమస్య అంటున్న అన్నదాతలు. చర్చలు సఫలం కావడం లేదు. నిరసనలు మాత్రం ఉధృతమవుతున్నాయి. 72 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన గళం విప్పుతున్న రైతు సంఘాలు దేశ వ్యాప్త నిరసనలకు తెరలేపాయి. ఇవాళ చక్కా జామ్ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చాయి.
వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రకాల ఆందోళనలకు పిలుపునిస్తోన్న రైతు సంఘాలు ఇవాళ మరో నిరసనకు సిద్ధమయ్యాయి. దేశమంతా రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ నిరసన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల పాటు రహదారుల్ని బ్లాక్ చేయనున్నారు రైతులు. అయితే జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో చక్కా జామ్‌పై దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
రిపబ్లిక్ డే ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి రైతుల నిరసన కార్యక్రమానికి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళన చేస్తోన్న రైతులను ఢిల్లీలోకి అడుగుపెట్టనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. పరిస్థితులను బట్టి మరిన్ని బలగాలను రంగంలోకి దించి, బారికేడ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని దిల్లీ పోలీసులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి అసత్య వార్తలు, వదంతులు వ్యాప్తిచేయకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్‌ఎన్ శ్రీవాస్తవ వెల్లడించారు.
ఇక జాతీయ రహదారుల దిగ్భంధంపై రైతు సంఘాలు కీలక ప్రకటన చేశాయి. ఢిల్లీ శివార్లతో పాటు ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలను చక్కాజామ్ నుంచి మినహాయింపు ఇస్తునట్టు ప్రకటించారు రైతు సంఘాల ప్రతినిధి రాకేశ్ టికాయత్. ఇప్పటికే ఢిల్లీ చక్కా జామ్‌లో ఉండగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి రైతులు సాఫీగా ఢిల్లీ చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
మరోవైపు రహదారుల దిగ్బంధానికి సంయుక్త కిసాన్ మోర్చా మార్గదర్శకాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రహదారుల నిర్బంధం ఉంటుందని ప్రకటించింది. అంబులెన్స్, స్కూల్ బస్సులు వంటి సేవలు కొనసాగించాలని తెలిపింది. చక్కా జామ్‌లో పాల్గొనే రైతులు శాంతియుతంగా, అహింసాత్మకంగా ఉండాలని పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. అధికారులు, ఉద్యోగులు, సాధారణ పౌరులతో గొడవలకు పాల్పడవద్దని ఆందోళనకారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఆందోళన ముగియడానికి నిమిషం ముందు నిమిషం పాటు రహదారి దిగ్బంధంలో ఉన్న వాహనాలన్నీ హారన్ కొట్టి రైతులకు సంఘీభావం తెలపాలని.. అన్నదాతకు మద్దతు తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సంయుక్త కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్.