మహారాష్ట్రలో స్కూల్ పిల్లల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పడవ ప్రయాణం
Maharashtra: విద్యార్థుల ప్రయాణంపై తల్లిదండ్రుల ఆందోళన
మహారాష్ట్రలో స్కూల్ పిల్లల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పడవ ప్రయాణం
Maharashtra: చంద్రునిపైకి రాకెట్లు పంపుతూ.. అంతరిక్షంలోనే అగ్ర స్థానం వైపు దూసుకెళుతున్న భారత దేశంలో విద్యార్థులు మాత్రం బడికి వెళ్లేందుకు యుద్ధమే చేయాల్సి వస్తోంది. మహారాష్ట్రలోని ఓ మారుమూల పల్లె విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్కూలుకెళ్లాలంటే పలు రకాల ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. రోజూ 10 కిలో మీటర్ల దూరం వెళ్లి రావాలి.. ఇంటి నుంచి బయల్దేరిన విద్యార్థులు ముందుగా పంట పొలాల్లో నడుచుకుంటూ వెళ్లాలి.. పంట పొలాల్లో నడిచి వెళ్లేటప్పుడు ఎక్కడ విష కీటకాలు కాటేస్తాయో తెలియదు.. ఎక్కడి నుంచి వన్య ప్రాణులు దాడి చేస్తాయో తెలియదు.. బడికి వెళ్లాలంటే మొత్తానికి యుద్ధమే చేయాల్సి వస్తోంది.
ఎలాగోలా నడుచుకుంటూ నదీ తీరానికి చేరుకున్న విద్యార్థులకు ఇక్కడే అసలు కష్టాలు మొదలవుతాయి. నిండు కుండలా మారిన గోదావరిని రోజూ దాటాల్సిందే.. అది కూడా ఒక థర్మాకోల్ షీట్‌నే పడవలా మార్చుకుని ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు. థర్మాకోల్ షీట్‌తో ఏర్పాటు చేసుకున్న నాటు పడవను విద్యార్థులే నడుపుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. ఆ గ్రామ ప్రజలు 50 ఏళ్లుగా ఇవే కష్టాలను ఎదుర్కొంటున్నారు. గోదావరి నదిపై జాయిక్వాడీ డ్యామ్ నిర్మాణంలో గ్రామం నీట మునిగింది. పునరావాసం కింద గ్రామం ఆవలి ఒడ్డున నిర్మించడంతో విద్యార్థులకు ఈ కష్టాలు మొదలయ్యాయి. మామూలు రోజుల్లో నదీ ప్రవాహం తక్కువగా ఉంటుంది.. డ్యామ్ పూర్తిగా నిండితే బ్యాక్ వాటర్ లెవెల్స్ ప్రమాద స్థాయికి చేరుకుంటాయి. అప్పుడు పేరెంట్స్ దగ్గరుండి నది దాటించాల్సి వస్తోంది.
గ్రామం నుంచి ఆవలి ఒడ్డుకు దాటేందుకు ఓ బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న వారే లేరు. ప్రాణాలను అరచేత పట్టుకుని నదిని దాటిన విద్యార్థులు మళ్లీ కొంత దూరం నడిస్తే కానీ స్కూల్‌కు చేరుకోలేరు. ఇన్ని కష్టాలు పడి స్కూల్‌కు చేరుకున్న విద్యార్థులకు సరిపడా వసతి లేదు.. చెట్ల కిందే విద్యార్థులు చదువును కొనసాగించాల్సి వస్తోంది. ఇంటి నుంచి బయల్దేరిన విద్యార్థులు తిరిగి ఇంటికి వచ్చే వరకు పేరెంట్స్ భయపడుతూనే ఉంటారు.