Indian Soldiers: జవాన్ల త్యాగం వెనుక..కన్నీటి గాథలెన్నో!

Indian Soldiers: చివరి శ్వాస వరకు పోరాడి అమరులైన జవాన్ల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి.

Update: 2021-04-07 05:56 GMT

Indian Soldiers: (File Image)

Soldiers: ఓవైపు చుట్టుముట్టిన మావోయిస్టులు..మరోవైపు దూసుకోస్తున్న తూటాలు..ఏ క్షణంలోనైనా మృత్యువు కౌగిలిలో బందీ కావుచ్చు. అలాంటి భయానక పరిస్థితుల్లోనూ సంకల్పం వీడలేదు. చివరి వరకు నక్సల్స్ పోరాడుతూ..మృత్యువు కోరలు వంచే ప్రయత్నం చేశారు. చివరి శ్వాస వరకు పోరాడి అమరులైన జవాన్ల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. ఇంటికెళ్లి పుట్టబోయే కొడుకుని చూస్తానని ఎన్నో కలలుగన్న ఓ జవాను.. తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. తెల్లారితే సెలవులపై వెళ్లి.. పెళ్లి పనుల్లో బిజీ అవ్వనున్న మరో జవాను అసువులు బాసాడు.

నేనిక్కడ క్షేమంగానే ఉన్న అంటూ..

రెండు, మూడు రోజుల్లో వచ్చేస్తా, కంగారు పడొద్ధు. నేనిక్కడ క్షేమంగానే ఉన్నా' అంటూ తల్లిదండ్రులకు సమాచారం అందించిన ఆ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. విధి నిర్వహణలో జరిగిన పోరాటంలో అసువులుబాశాడు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో విజయనగరం పట్టణం గాజులరేగ ప్రాంతానికి చెందిన రౌతు జగదీష్‌ వీరమరణం పొందాడు. జగదీష్‌ కుటుంబం ఏళ్లుగా గాజులరేగలోనే నివాసం ఉంటోంది. వీరి పూర్వీకులు మక్కువ మండలం కంచేడువలస గ్రామానికి చెందిన వారు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి.

ఎలా చెప్పాలో అర్థంకాక..

ఉత్తరప్రదేశ్‌లోని షాహబ్‌గంజ్‌కు చెందిన ధరందేవ్‌ కుమార్ భార్య మీనాదేవి ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. భార్య కోసం ఆయన మరో రెండు రోజుల్లో సెలవులపై వెళ్లాల్సి ఉండగా.. బీజాపూర్‌ కాల్పుల్లో అమరుడయ్యారు. ఆయన భార్యకు ఇంకా విషయం తెలియదు. రెండ్రోజుల్లో వస్తానన్న తన భర్త ఇంకా రాలేదంటూ ఎదురు చూస్తున్న మీనాదేవికి విషయం ఎలా చెప్పాలో అర్థంకాక.. ధరందేవ్‌ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

తలపాగాతో కట్లు..

సిక్కు మతస్థులకు తలపాగా ఎంతో పవిత్రమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని పవిత్రతకు భంగం వాటిల్లనివ్వరు. అలాంటిది.. బల్‌రాజ్‌ సింగ్‌ అనే కోబ్రా కమాండో.. శనివారం నాటి కాల్పుల సందర్భంలో క్షతగాత్రులైన తన తోటి వారికోసం తలపాగాను వాడారు. తీవ్ర గాయాలపాలై.. రక్తమోడుతున్న ఎస్సై అభిషేక్‌ పాండేకు తన తలపాగాతో కట్లు కట్టాడు. రక్తస్రావం కాకుండా అడ్డుకుని, ఆయన ప్రాణాలను కాపాడారు. అలాగే.. సందీప్‌ ద్వివేదీ అనే జవానుకూ కట్లు కట్టారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ తీవ్రగాయాలతో రాయ్‌పూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News