Maha Kumbh 2025 final Snan: శివరాత్రి రోజు చివరి అమృత స్నానం..కుంభమేళాకు భారీగా తరలివచ్చిన జనం

Update: 2025-02-26 04:30 GMT

Maha Kumbh 2025 final Snan: కుంభమేళాలో భాగంగా మహాశివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే ప్రయాగ్ రాజ్ చేరుకున్న భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా అనంతరం లక్షలాది మంది తిరుగుముఖం పడుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతోపాటు రైల్వే శాఖ అప్రమత్తమైంది. యూపీ సర్కార్ 4,500 బస్సులు మోహరించగా ప్రయాగ్ రాజ్ నుంచి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు రైల్వే శాఖ 350 రైళ్లను నడుపుతోంది.

యూపీ ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా తుదిదశకు చేరుకుంది. జనవరి 13న మొదలైన ఈ కుంభమేళా మహాశివరాత్రి బుధవారం ముగియనుండగా మౌని అమావాస్య మాదిరిగానే శివరాత్రి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. మంగళవారం రాత్రికే సుమారు కోటి మంది భక్తులు త్రివేణీ సంగమానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. శివరాత్రి రద్దీ ద్రుష్ట్యా సీఎం యోగి ఆదిత్యనాథ్ నిరంతరం అధికారులతో సమీక్షిస్తున్నారు. భక్తుల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. త్రివేణీ సంగమం దగ్గర 37వేల మంది పోలీసులు, 14వేల మంది హోంగార్డులను మోహరించారు. పెద్దెత్తున ఏఐ ఆధారిత కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూమ్స్ ద్వారా భక్తుల రద్దీని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

భక్తుల రద్దీ ద్రుష్టిలో ఉంచుకుని యూపీ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మహాకుంభ్ నగర్ ప్రాంతం మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4గంటల నుంచే కుంభమేళా ప్రాంతానికి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించలేదు. భక్తులకు సమీపంలో ఉన్న ఘాట్లలో పుణ్యస్నానాలు పూర్తి చేయాలని..ఒకే చోటికి ఎక్కువ సంఖ్యలో తరలిరావద్దని అధికారులు విజ్నప్తి చేస్తున్నారు. భక్తులు వచ్చే మార్గాలకు అనుగుణంగా వారికి సమీపంలో ఉండే ఘాట్లని సూచిస్తున్నారు. పుణ్యస్నానాలు పూర్తి అయిన వెంటనే భక్తులు ఘాట్లను ఖాళీ చేయాలని కోరుతున్న అధికారులు రద్దీ నివారించాలని విజ్నప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News