ఆ క్రెడిట్ వెంకయ్య నాయుడిదే : అమిత్‌షా

ఆర్టికల్ 370 రద్దు బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాత్ర కీలకమైనదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

Update: 2019-08-11 11:42 GMT

ఆర్టికల్ 370తో ఇటు దేశానికి గానీ, అటు జమ్మూకశ్మీర్‌కు గానీ ఎలాంటి లాభం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. 370 రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదం అంతమై, రాష్ట్రం ఆర్థికంగా పరుగులు తీస్తుందని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి రచించిన 'లిజనింగ్, లర్నింగ్ అండ్ లీడింగ్' అనే పుస్తకావిష్కరణ సభ చెన్నైలో జరిగింది. ఈ సభలో అమిత్‌షా మాట్లాడారు. ఆర్టికల్ 370 తో వెంకయ్య నాయుడుకు ఉన్న సంబంధాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. వెంకయ్య నాయుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ బాధ్యతల్లో ఉన్న సమయంలో 370 కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సమయంలో ఓ ప్రొఫెసర్ ఎప్పుడైనా కశ్మీర్ చూశావా? అని ఆయన్ను అడిగారని అన్నారు.

దీనికి వెంటనే వెంకయ్య బదులిస్తూ.. మనకు రెండు కళ్లున్నా, ఒకటి నొకటి చూసుకోవని, కానీ ఇబ్బంది పడితే రెండు కళ్లనుంచీ నీళ్లు ధారాపాతంగా వస్తాయని ఆయనకు బదులిచ్చారని షా తెలిపారు. 370 రద్దుకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో పాస్ అయ్యిందంటే ఆ క్రెడిట్ వెంకయ్య నాయుడిదేనని షా స్పష్టం చేశారు. మొదట్లో సభలో ప్రవేశపెట్టడానికి తాను కొంత జంకానని, కానీ, వెంకయ్య నాయుడి నాయకత్వంలో బిల్లు పాసైందని అమిత్‌షా ఆనందం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News