India Gold Reserves: భరతభూమిలో 50 కోట్ల టన్నుల బంగారం...మైనింగ్‌ ఎందుకు చేయడంలేదో తెలుసా?

India Gold Reserves: భరతభూమి పుణ్యభూమి మాత్రమే కాదు… సిరి సంపదల నిలయం కూడా.

Update: 2026-04-11 06:46 GMT

India Gold Reserves

India Gold Reserves: భరతభూమి పుణ్యభూమి మాత్రమే కాదు… సిరి సంపదల నిలయం కూడా. ఈ నేల కింద సుమారు 50 కోట్ల టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఇంత విలువైన బంగారం మన నేలలో ఉన్నా... దానిని తవ్వి తీసుకోకుండా... మనం సంవత్సరానికి కేవలం 1.3 నుంచి 1.5 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేయడం వందల టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ కోట్లాది డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం. దిగుమతి కారణంగా ధరలు పెరగడంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం కూడా పెరుగుతోంది. అయినప్పటికీ బంగారం కొనుగోలు తగ్గడం లేదు. ఎందుకంటే బంగారం భారతీయులకు కేవలం ఆభరణం కాదు… భద్రతకు సంకేతం.

అపారమైన నిక్షేపాలు.. అల్పమైన ఉత్పత్తి

గణాంకాల ప్రకారం భారత్‌ నేలలో సుమారు 50 కోట్ల టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నాయని నిపుణుల అంచనా. కానీ, మనం ఏడాదికి తీస్తున్నది కేవలం 1.3 నుండి 1.5 టన్నులు మాత్రమే. దేశీయ ఉత్పత్తిలో 92 శాతం కేవలం కర్ణాటకలోని 'హుత్తి' గనుల నుండే వస్తోంది. అపారమైన నిక్షేపాలు ఉన్నప్పటికీ మైనింగ్‌ చేయకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మన దగ్గర బంగారం ఉన్నా తవ్వలేకపోవడానికి ప్రధాన కారణం 'రెడ్ టేపిజం'.

పర్యావరణ అనుమతులు, పన్ను నిబంధనలు, పాత చట్టాలు ఇవన్నీ కలిసి ప్రాజెక్టులను సంవత్సరాల పాటు నిలిపివేస్తాయి. ఇతర దేశాల్లో సింగిల్ విండో విధానం ఉండగా, మన దగ్గర అనేక దశల ప్రక్రియ ఉండటం వల్ల పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు పెట్టుబడి కూడా పెద్ద సవాలు. గోల్డ్ మైనింగ్ ప్రారంభించాలంటే బిలియన్ల డాలర్లు అవసరం. దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ప్రభుత్వాలు మారితే విధానాలు మారుతాయన్న భయం పెట్టుబడిదారుల్లో ఉంటుంది. ఈ అనిశ్చితి కూడా మైనింగ్ అభివృద్ధిని అడ్డుకుంటోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి ప్రాంతాల్లో కొత్త బంగారు నిక్షేపాలు గుర్తించారు. వీటిని తవ్వి తీసేందుకు అనుమతులు లభిస్తే...స్థానికులకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు పెరుగుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమే. కానీ ఆధునిక సాంకేతికతతో మైనింగ్ చేస్తే నష్టాన్ని తగ్గించవచ్చు. సరైన నియంత్రణలతో ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ సంపదను వినియోగించుకోవచ్చు.

మొత్తంగా చూసుకుంటే... మన దగ్గర ఉన్న సంపదను సద్వినియోగం చేసుకోవడం సమయానుకూల నిర్ణయం తీసుకోవడం అవసరం. బంగారం మైనింగ్ పెరిగితే దేశానికి ఆదాయం పెరుగుతుంది, రూపాయి బలపడుతుంది, ప్రజలకు ఉపాధి లభిస్తుంది. సరైన విధానాలు అమలు చేస్తే… భరతభూమి సంపద నిజంగా ప్రజల జీవితాలను మార్చగలదనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News