జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది ఏరివేత

Update: 2020-01-31 04:14 GMT

మరోసారి ఉగ్రవాదులు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందగా, ఒక పోలీసు గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ఆపరేషన్ జరుగుతోంది.. జమ్మూను శ్రీనగర్‌తో కలిపే రహదారిపై భద్రతా దళాలు వాహనాల రాకపోకలను నిలిపివేశాయి. జమ్మూ-శ్రీనగర్ హైవేలోని బాన్ టోల్ ప్లాజా వద్ద అనుమానిత ట్రక్కును పోలీసులు అడ్డగించారని పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఆ ట్రక్కులో ప్రయాణిస్తున్న ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారని.. దాంతో ఎన్‌కౌంటర్‌ జరిపామని.. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మృతి చెందాడని.. అలాగే ఒక పోలీసు కూడా గాయపడ్డాడని ఆయన తెలిపారు. తీవ్రంగా గాయపడటంతో పోలీసును ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు.

ఎన్‌కౌంటర్‌కు కారణమైన వివరాలను పై అధికారులకు నివేదించారు. అయితే పోలీసులు కాల్పులు ప్రారంభించడంతో ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుండి పారిపోయి సమీప ప్రాంతాలకు చేరుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ అయిన వెంటనే పోలీసులు, సిఆర్పిఎఫ్, ఆర్మీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టింది. భద్రతా సిబ్బంది తనికీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు ఇటీవల చొరబడి కాశ్మీర్‌కు వెళుతున్నారని, ఆయుధాలు దాచడానికి దక్షిణ కాశ్మీర్‌కు వెళ్లే ప్రయత్నం చేసినట్టు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. కాగా ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యగా, శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇదిలావుంటే ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులు చేయాలన్న ఉగ్రవాదుల కుట్రను సైన్యం భగ్నం చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోని అవంతిపురలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో కాల్పులు జరిపి ఉగ్రవాది నాయకుడు యాసిర్‌తో పాటు మరో ముగ్గురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. 

Tags:    

Similar News