Taj Mahal: తాజ్ మహల్ సందర్శకులకు ఎంట్రీ టికెట్ షాక్!

Taj Mahal: ప్రపంచం వింతల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్‌ సందర్శన మరింత ప్రియం కానుంది.

Update: 2021-03-16 06:42 GMT

తాజ్ మహల్ (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Taj Mahal: మన దేశ చరిత్రకు గర్వకారణంగా నిలిచిన అత్యాధునిక సుందర కట్టడం తాజ్‌మహల్‌. భారతదేశం అనగానే ప్రపంచంలో ఎవరికయినా తొలుత స్ఫురణకొచ్చేది తాజ్‌మహల్‌. ప్రపంచం యావత్తూ చూడాలని తపించే పాలరాతి కట్టడం తాజ్‌మహల్. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన తాజ్‌మహల్‌ సందర్శనం మరింత ప్రియం కానుంది. ఎంట్రీ టిక్కెట్ ధరలను పెంచే ఆలోచనలో ఆగ్రా యంత్రాంగం ఉంది. పెరగనున్న ధరలు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు వర్తించనున్నాయి.

పెరిగిన ధరలు ఇలా...

ఇండియన్ టూరిస్టులు ప్రస్తుతం రూ.50 టిక్కెట్‌ చెల్లించి తాజ్‌మహల్‌ను సందర్శిస్తున్నారు. ఈ ధర రూ.80కి పెరగనున్నట్టు ఆగ్రా యంత్రాంగం తెలిపింది. విదేశీ టూరిస్టులు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1100కు బదులు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ప్రధాన డోమ్ సందర్శించాలనుకునే వారి నుంచి ఆగ్రా డవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ) అదనంగా రూ.200 వసూలు చేయనుంది. ఏఎస్ఐ వసూలు చేస్తున్న రూ.200తో దీనికి సంబంధం లేదని ఆగ్రా డివిజనల్ కమిషనర్ అమిత్ గుప్తా తెలిపారు. కొత్త చార్జీల అమలులోకి వస్తే, ప్రధాన డోమ్ సందర్శించాలనుకునే దేశవాళీ టూరిస్టులు రూ.480, విదేశీ టూరిస్టులు రూ.1,600 చెల్లించాల్సి ఉంటుంది.

ఏప్రిల్ నుండి కొత్త ధరలు...

ఏప్రిల్‌ నుంచి కొత్త ధరలు అమలయ్యే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంలో సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత గత జనవరిలో తాజ్‌మహల్‌ సహా ఇతర కట్టడాల సందర్శనను తిరిగి తెరిచారు. తాజ్‌మహల్ ఆవరణలో కానీ, ఏఎస్ఐ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ద్వారా కానీ ఎంట్రీ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.

వారసత్వసంపదగా...

తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ లాంటి పర్యాటక ప్రాంతాలు ఆగ్రాను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాయి. ఆగ్రాలోని తాజ్‌మహల్, ఆగ్రాకోట, ఫతేపూర్ సిక్రీలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించబడి సంరక్షించబడుతున్నాయి. ఆగ్రా నగరం మొఘలుల పరిపాలనకు ముందు ఎవరి పాలనలో ఉండేది అనే ఆధారాలు తక్కువగా ఉన్నా ప్రపంచ గుర్తింపు వచ్చేలా ఈ నగరాన్ని తీర్చిదిద్దింది మాత్రం మొఘలులనే చెప్పవచ్చు.

ఏడు వింతల్లో ఒకటిగా...

ప్రపంచంలోని అత్యాధునిక ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్‌ సందర్శనం కోసం వేల మైళ్ళ దూరం నుంచి మన దేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని సందర్శించే దేశదేశాల పాలకులు తమ పర్యటనలో భాగంగా తాజ్‌మహల్‌ను దర్శిస్తారు. కొట్లాదిమంది హృదయాల్ని దోచుకొని, వారి జ్ఞాపకాల్లో నిలిచిపోయిన తాజ్‌మహల్‌ను మనం ఎంత అపురూపంగా కాపాడుకోవాలి. 

Tags:    

Similar News