TOP 6 NEWS @ 6PM: SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో కార్మికులు ఎక్కడున్నారో గుర్తించాం - మంత్రి జూపల్లి
SLBC Tunnel tragedy latest updates: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో తాజా పరిస్థితిని మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాకు వివరించారు
SLBC Tunnel Incident: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో తాజా పరిస్థితి వివరించిన మంత్రి జూపల్లి
1) SLBC Tunnel Incident: ఎస్ఎల్‌బీసీ సొరంగంలో తాజా పరిస్థితి వివరించిన మంత్రి జూపల్లి
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. సొరంగంలో గల్లంతయిన వారి ఆచూకీ ఇంకొన్ని గంటల్లోనే లభించే అవకాశం ఉందన్నారు. సొరంగంలో మనుషుల ఆనవాళ్లు ఉన్నట్లుగా స్కానింగ్ మెషిన్ ద్వారా శాస్త్రీయ ఆధారాలు గుర్తించిన చోటే తవ్వకాలు జరుపుతున్నట్లు చెప్పారు. ఒక చోట 5-8 మీటర్ల మట్టి దిబ్బ కింద నలుగురి ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ కింద మరో నలుగురు కార్మికులు ఉన్నట్లుగా గుర్తించామన్నారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ వేగంగా చేయడం లేదని విమర్శిస్తోన్న వారికి లోపల పరిస్థితి ఏంటో పూర్తిగా తెలియడం లేదని మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. మొత్తం 11 విభాగాల నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను విమర్శించే వారు ఒకసారి లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుందని మంత్రి జూపల్లి అభిప్రాయపడ్డారు.
2) పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత.. జైలు నుండి ఆస్పత్రికి తరలింపు
Posani Krishna murali's health condition: పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్‌ను, నారా లోకేష్‌ను దూషించిన ఘటనలకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులోనే ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా కోర్టు 14 రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం పోసాని కృష్ణమురళి అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్నారు. జైలులో ఉండగానే శనివారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పిగా ఉందని ఆయన జైలు సిబ్బందికి చెప్పారు. దాంతో వెంటనే పోలీసులు ఆయన్ను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) Teenmar Mallanna: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. ఈ ఏడాది ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం వివరణ కోరింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని తీన్మార్ మల్లన్నకు గడువు ఇచ్చింది క్రమశిక్షణ సంఘం. గడువు తీరినా కూడా ఆయన నుంచి వివరణ రాకపోవడంతో సస్పెన్షన్ విధించారు.
ఓ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. దీంతో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. కుల గణన సర్వేకు సంబంధించిన రిపోర్టు విషయంలో మల్లన్న తీరుపై పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉంది. ఆ తర్వాత ఓ సమావేశంలో ఆయన ఓ వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలాన్ని రేపాయి.
4) Uttarakhand Avalanche: మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురి మృతి, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Uttarakhand Avalanche latest updates: ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. ఇప్పటికీ ఇంకో ఐదుగురి ఆచూకీ లభించలేదు. వారి కోసం ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇక్కడ నిరంతరంగా కురుస్తోన్న మంచు సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. అయినప్పటికీ రెస్క్యూ టీమ్ తమ ప్రయత్న లోపం లేకుండా వారిని కాపాడటం కోసం కృషి చేస్తున్నాయి. మంచు చరియల కింద నుండి బయటికి తీసుకొచ్చిన వారిని సహాయ బృందాలు మనలోని ఐటిబిపి శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) Ramayana: 'రణబీర్, సాయి పల్లవి రామాయణ సినిమాకు ఓపెన్ హైమర్ స్థాయి గుర్తింపే టార్గెట్'
Ramayana: రామాయణ సినిమాకు ఆస్కార్ వస్తోందని ఆ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ధీమాగా చెబుతున్నారు. 2026 దీపావళి నాటికి ఈ సినిమా మొదటి భాగం విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక రెండో భాగాన్ని 2027లో విడుదల చేయనున్నారు.2024 నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్ కు వచ్చినంత గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఆయన పంచుకున్నారు.
అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు అవార్డు రావడం మనపైనే ఆధారపడి ఉంటుందని నమిత్ చెప్పారు. ఏ స్థాయిలో ప్రచారం చేశామనేది ముఖ్యమని...ఎలా ప్రచారం చేశామనేది ముఖ్యమని ఆయన అన్నారు. ఈ సినిమాతో భారతీయ కథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని నమిత్ చెప్పారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6)Trump-Zelensky: వైట్హౌస్లోనే ట్రంప్‌తో జెలెన్‌స్కీ యుద్ధం.. ఆందోళనకు గురైన ఉక్రెయిన్ రాయబారి
Trump-Zelensky: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య సమావేశం ఊహించని మలుపు తిరిగింది. పొడగ్తలతో ప్రారంభమైన సమావేశం కొద్దిసేపటికే వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఎలాంటి ఒప్పందం జరగకుండానే జెలెన్‌స్కీ వైట్ హౌస్‌ను వీడారు. అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీ మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
ట్రంప్, జెలెన్ స్కీ మధ్య సజావుగా మొదలైన భేటీ కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని.. జెలెస్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ఆ సమయంలో ఇరుదేశాల రాయబారులు ఎదురుగానే ఉన్నారు. ట్రంప్ మాటలు, జెలెన్ స్కీ ప్రతిస్పందనతో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. అయ్యో ఇలా జరుగుతుందేంటి..? అన్నట్టుగా తల పట్టుకున్నారు. ఆమె హవభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.