Kerala Blasts: కేరళలో వరుస పేలుళ్లు

Kerala Blasts: కొచ్చి ప్రార్థనాలయంలో మూడు సార్లు పేలుడు

Update: 2023-10-30 05:26 GMT

Kerala Blasts: కేరళలో వరుస పేలుళ్లు

Kerala Blasts: కేరళ కొచ్చి సమీపంలోని కలామస్సెరీలో ఉన్న జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో పేలుళ్ళతో దేశం ఉలిక్కిపడింది. పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. పేలుడు జరిగిన ప్రార్థనా మందిరాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారణమైన వస్తువుల సేకరణ, సాక్ష్యాల నమోదు కోసం పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. మొత్తం 3 బాంబులు పేలాయని, వాటిలో రెండు శక్తిమంతమైనవని, ఒకటి తక్కువ తీవ్రత కలిగినదని సమాచారం. ఘటనపై కేరళ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌తోపాటు ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్నాయి. పేలుడులో IEDని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీఎం ఆధ్వర్యంలో ఈరోజు జరిగే అఖిలపక్ష సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు.

రెండువేల మంది ప్రార్థనలు చేసేందుకు సిద్ధమైన భారీ శబ్దంతో పేలుడు జరగడంతో గందరగోళ వాతావరణం నెలకొన్నది. చెవులు చిల్లులు పడే శబ్ధం రావడంతో ప్రార్థనలకు వచ్చిన జనాలు కకావికలయ్యారు. పరిసరాలన్నీ భయంకరంగా మారిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలంలోనే ఒకరు చనిపోగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళు ఉన్నారు. 51మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

పేలుళ్లు తానే జరిపానంటూ డొమినిక్‌ మార్టిన్‌ అనే ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. జెహోవాస్‌ విట్‌నెసెస్‌ గ్రూపునకు చెందినవాడిగా తన గురించి చెప్పుకొన్నట్లు సమాచారం. బాంబు పేలుళ్లకు తానే పాల్పడినట్లు చెప్పి పోలీసులకు లొంగిపోయిన డొమినిక్‌ మార్టిన్‌.. అంతకుముందు యూట్యూబ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. గత 16 ఏళ్లుగా జెహోవాస్‌ విట్‌నెసెస్‌లో నేను సభ్యుడిగా ఉన్నా. వారు దేశద్రోహ భావజాలంతో ఉండటంతో మార్చటానికి ప్రయత్నించా. కానీ మార్పు లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నాని వీడియోలో వెల్లడించాడు.

అయితే జెహోవాస్‌ విట్‌నెసెస్‌ అనే క్రైస్తవ గ్రూపు ఆధ్వర్యంలో మూడు రోజులుగా ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చివరిరోజైన ఆదివారం దాదాపు 2 వేల మంది సమావేశమయ్యారు. అయితే ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం దృష్ట్యా కేరళలో పలుప్రాంతాల్లో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు జరుగుతున్నాయి. ఈసభల్లో ఒక వర్గానికి చెందిన ప్రవక్త వర్చువల్‌గా చేసిన ప్రసంగమే పేలుళ్ళకు దారితీసిందని స్థానికుల బావన. కోచి ప్రాంతంలో యూదుల సంఖ్య అధికం. జెహోవా’స్‌ విట్‌నెసెస్‌ సమావేశం యూదులది అని భావించి దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.

కేరళలో పేలుళ్లతో దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని ప్రధాన మార్కెట్‌‌లు, చర్చిలు, మెట్రో స్టేషన్‌‌లు, బస్టాండ్‌‌లు, రైల్వే స్టేషన్లు ఇతర బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పెంచారు. ఉత్తరప్రదేశ్ వైపు, హర్యానా వైపు సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్లు వేయాలని నిర్ణయించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమాచారాన్ని విస్మరించవద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. పెట్రోలింగ్ పెంచారు. అదేవిధంగా, పండుగల సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచ్‌‌ల నేపథ్యంలో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Tags:    

Similar News