Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా పేరు ఖరారు.. నేడు ప్రమాణ స్వీకారం
Delhi New CM: ఢిల్లీ సీఎం అభ్యర్ధి పేరు ఖరారు అయ్యింది. ఇప్పటి వరకు రేసులో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ బీజేపీ అధిష్టానం, బీజేపీ శాసనసభాపక్షం మహిళా నేత రేఖాగుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వచ్చిననాటి నుంచే నేటి వరకు 11 రోజులుగా ముఖ్యమంత్రి ఎవరిని ప్రకటిస్తారనే తీవ్ర ఉత్కంఠగా కొనసాగింది. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్న దానిపై చివరకు బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం రేఖా గుప్తా పేరును ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో సస్పెన్స్ కు తెరపడింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేసులో ప్రథమంగా వినిపించిన పర్వేష్ వర్మను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించబోతున్నట్లు సమాచారం.
కాగా నేడు కొత్త సీఎం పదవి చేపట్టబోతున్న రేఖా గుప్తా గురువారం ఫిబ్రవరి 20న రాంలీలా మైదాన్ లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ఢిల్లీలో బీజేపీ 27ఏళ్ల తర్వాత అధికారాన్ని చేపట్టబోతోంది. గతంలో రెండుసార్లు ఆప్ పార్టీ రూలింగ్ చేసింది. అంతకుముందు కాంగ్రెస్ మూడు పర్యాయాలు అధికారాన్ని చేజిక్కించుకుని పాలనను కొనసాగించింది. 27ఏల్ల తర్వాత బీజేపీకి హస్తినను పాలించే ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరని పెట్టాలన్న దానిపై ఇంతకాలం సందిగ్ధం నెలకొంది. అయితే ఇప్పటి వరకు సీఎం రేసులో వినిపించిన నలుగురిలో పర్వేష్ శర్మను డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తారని సమాచారం. ఇక ఢిల్లీ సీఎంగా పదవి చేపడుతున్న నాలుగో మహిళా నేతగా రేఖా గుప్తా చరిత్రలో నిలిచారు.