Coronavirus: దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

Coronavirus: పాజిటివ్‌ కేసులకు అనుగుణంగా మరణాలు * మరింత గుబులు పుట్టిస్తోన్న కరోనా స్ట్రెయిన్‌

Update: 2021-04-03 01:28 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Coronavirus: కరోనా రెండోదశ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 80వేలు దాటింది. దీంతో మహమ్మారిని నియంత్రించేందుకు కొన్ని రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూని విధించాయి. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం అలెర్ట్‌ చేసింది.

భారత్‌లో కరోనా వైరస్‌ మళ్లీ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ మరింత గుబులు పుట్టిస్తోంది. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ప్రమాద ఘంటికలు మోగిస్తోండగా కొన్ని రోజులుగా ఢిల్లీలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చెప్పాలంటే.. పూణెలోసైతం కరోనా కేసుల గ్రాఫ్‌ పైపైకి దూసుకుపోతుండటంతో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ విధించడాన్ని తోసిపుచ్చలేమన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే. వైరస్‌ తీవ్రతను బట్టి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటికే కొవిడ్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పలు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ వంటి ప్రత్యేక ఆంక్షలు అమలవుతున్నాయి. అటు ఢిల్లీలో కరోనా ఉధృతికి అడ్డుకట్టవేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు సీఎం కేజ్రీవాల్‌. ప్రస్తుతం నాలుగో వేవ్‌ నడుస్తోన్న కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించే యోచన ప్రభుత్వానికి లేదన్నారు.

పూణెలో సైతం పాజిటివ్‌ కేసులు పెరగడంతో అధికారులు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఏడు రోజుల పాటు బార్లు, హోటళ్లుతోపాటు రెస్టారెంట్లు, థియేటర్లను మూసివేయాలని ఆదేశించారు. ఇక కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గెజిటెడ్‌ సెలవు రోజులు సహా ఏప్రిల్‌ నెల అన్ని రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను కొనసాగించాలని రాష్ట్రాలకు తెలియజేసింది. వేసవికాలంలో చల్లగా ఉండే ఏసీ గదుల్లో గడపడం ప్రజలు తగ్గించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

Tags:    

Similar News