Jammu Border: జమ్మూ సరిహద్దుల్లో ఉగ్రవాది హతం..భారత డ్రోన్ పై పాక్ కాల్పులు
Jammu Border: జమ్మూ సరిహద్దుల్లో భారత డ్రోన్ పై పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయి. మరోవైపు పాకిస్తాన్ నుంచి చొరబడ్డ ఉగ్రవాదిని మన భద్రతా దళాలు కాల్చి చంపాయి.
Jammu Border
Jammu Border: జమ్మూ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో భారత రిమోట్ పైలట్ విమానంపై పాకిస్థాన్ కాల్పులు జరిపింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. నివేదికల ప్రకారం, మంగళవారం రాత్రి కనాచక్ సెక్టార్‌లోని పాకిస్తానీ పోస్టుల నుండి మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరిగాయి. వీటిలో నాలుగు రౌండ్లు ఖేరీ పోస్ట్ నుండి, ఒకటి అస్లాం పోస్ట్ నుండి జరిగాయి.
పాకిస్థాన్ ఈ కాల్పులు జరిపిన సమయంలో భారత ఆర్పీఏ తమ ప్రాంతంలో సాధారణ నిఘా (సార్ట్) నిర్వహిస్తోంది. అయితే, భారత డ్రోన్ దెబ్బతినకుండా సురక్షితంగా తిరిగి వచ్చింది. సరిహద్దు వెంబడి పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది, దీనికి భారత సైన్యం తగిన విధంగా సమాధానం ఇచ్చింది.
ఉద్రిక్తతను పెంచవచ్చు
పాకిస్థాన్ సరిహద్దు దళాల ఈ చర్య ఉద్రిక్తతలను మరింత పెంచవచ్చని నిపుణులు అంటున్నారు. గత సంవత్సరం ఇరు దేశాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, ఒక చిన్న రెచ్చగొట్టే చర్య కూడా యుద్ధంగా మరే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచం యుద్దాలతో ఇబ్బందులు పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో, పాకిస్థాన్ చర్యలు చాలా బాధ్యతారహితమైనవిగా మరియు రెచ్చగొట్టేవిగా పరిగణిస్తున్నారు.
తరుచూ నిబంధనల ఉల్లంఘన
భారత సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే పాక్ ఉల్లంఘిస్తోంది. ఈమధ్య కాలంలో నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్తానీ డ్రోన్లు, బెలూన్లు కనిపించాయి. అంతేకాకుండా, భారతదేశంపై దాడి చేస్తామని పదేపదే శపథం చేసే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాకిస్తాన్ నిరంతరం మద్దతు ఇస్తోంది. భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు మరియు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఉగ్రవాది కాల్చివేత..
మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్‌లో సైన్యం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించగా, అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయని అధికారులు తెలిపారు. మధ్యమధ్యలో కాల్పులు జరుగుతున్నప్పటికీ, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను వ్యూహాత్మకంగా పునర్వ్యవస్థీకరించామని అధికారులు చెప్పారు. మన సైనికులు సమర్థవంతంగా ఎదురుదాడి చేయడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, గందర్‌బల్‌లోని అరాహమా ప్రాంతంలో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో డ్రోన్‌లు కూడా చక్కర్లు కొడుతూ కనిపించాయి.
నియంత్రణ రేఖ సమీపంలో డ్రోన్లు..
ఇదిలా ఉండగా, జమ్మూలోని ఇండో-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) సమీపంలో ఒక అనుమానాస్పద డ్రోన్ కనిపించింది. నియంత్రణ రేఖలోని అఖ్నూర్ సెక్టార్‌లో డ్రోన్‌లు కనిపించగా, మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కలిత్ గ్రామంలో మరో డ్రోన్ కనిపించింది. ఆ డ్రోన్ కొన్ని నిమిషాల పాటు భారత భూభాగంపై చక్కర్లు కొట్టింది.