Delhi Polls Results 2025: ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి 5 కారణాలు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత పని చేసింది!!

Update: 2025-02-08 08:24 GMT

అద్దాల మేడ నుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వరకు... ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఇవే కారణమా? 

Delhi Assembly elections Results 2025: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపి మెజారిటీ సీట్లతో మ్యాజిక్ ఫిగర్ దాటి విజయం ఖరారు చేసుకుంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి అధికారానికి దూరమైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖాతానే తెరవకుండా మనుగడే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.

ఇక ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి విషయానికొద్దాం. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూసిన ఆ పార్టీ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ప్రజలు మళ్లీ తనను గెలిపించి ఆ స్థానంలో కూర్చోబెడితేనే తాను సీఎం అవుతానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తను ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేశానని, మరీ ముఖ్యంగా విద్యా శాఖలో, వైద్య ఆరోగ్య శాఖలో ఎంతో మార్పు తీసుకొచ్చానని అన్నారు. అందుకే ఢిల్లీ వాసులు మరోసారి తమ పార్టీకే ఓటు వేస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తంచేశారు. కానీ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి వ్యతిరేకంగానే వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందనేదే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల ముందున్న సందేహం.

ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు

ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి నాలుగైదు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అవి ఏంటి? అవి ఎందుకు అంత తీవ్ర ప్రభావం చూపించాయనేది ఇప్పుడు చూద్దాం.

1) కేంద్రంపై కేజ్రీవాల్ ఆరోపణ

ఢిల్లీలో 2015 లో, 2020 లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆరంభంలో ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. విద్యా శాఖలో, ఆరోగ్య శాఖలో మౌలిక వసతులు పెంచి తమ మార్క్ చూపించారు. విద్యుత్, నీటి బిల్లు సబ్సీడీలతో ఓటర్ల మెప్పు పొందారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అభివృద్ధి లోపించిందనే విమర్శలు మూటగట్టుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వాసులకు ఊపిరి ఆడకుండా చేస్తోన్న కాలుష్యం సమస్య పెను సవాలై కూర్చుంది.

అయితే, తమ ప్రభుత్వం కొన్ని విషయాల్లో ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం కేంద్రమే అని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తూ వచ్చారు. ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదన్నారు. ఢిల్లీ ప్రభుత్వం పంపే ప్రతి ప్రతిపాదనకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కొర్రీలు పెట్టి అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఢిల్లీ అభివృద్ధి చెందితే ఆ క్రెడిట్ ఆప్‌నకు దక్కుతుందనే భయంతోనే బీజేపి సహకరించడం లేదన్నారు.

ఎక్కడైనా అభివృద్ధి జరగకపోతే అందుకు బీజేపినే కారణమని కేజ్రీవాల్ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ ఓటర్లు తిరస్కరించారు. అదే సమయంలో బీజేపి నేతలు చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కార్ హామీలు వారిని ఆకర్షించి ఉండవచ్చు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి దూరం జరిగి ఈసారి బీజేపి వైపు మొగ్గుచూపారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలతో కేజ్రీవాల్ ఒకరకంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇది మొదటి కారణం కాగా ఇక ఇప్పుడు రెండో కారణం ఏంటో చూద్దాం.

2) రూ. 34 కోట్ల అద్దాల మేడలో అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యాక పలు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. హంగూ, ఆర్భాటాలతో ఆమ్ ఆద్మీకి దూరమయ్యారని బీజేపి ఆరోపించింది. అందులో అతి ముఖ్యమైనది శీశ్ మహల్ ఆరోపణ. కాగ్ నివేదిక లెక్కల ప్రకారం... అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం మరమ్మతుల కోసం తొలుత రూ. 7.91 కోట్ల నిధులతో అంచనా వేశారు. 2020 లో పనులు చేపట్టేటప్పటికీ ఈ అంచనా వ్యయం రూ. 8.62 కోట్లకు పెరిగింది. 2022 లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పని పూర్తి చేసేటప్పటికీ పూర్తి వ్యయం రూ. 33.66 కోట్లు అయింది.

రాజకీయాల్లో అవినీతితో పాటు వీఐపి కల్చర్‌ను ఊడ్చిపారేస్తామనే నినాదంతో అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకొచ్చారు. కానీ అదే కేజ్రీవాల్ ఇప్పుడు అద్దాల మేడలో ఉంటున్నారని బీజేపి ఆరోపించింది. "అద్దాల మేడలో అరవింద్ కేజ్రీవాల్" అనే నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో బలంగా వాడుకుంది. ఇది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లను దూరం చేసి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

3) ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసుతో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు జాతీయ స్థాయిలో న్యూస్ హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో రూ. 100 కోట్ల ముడుపులు ముట్టినట్లుగా కేజ్రీవాల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇదే కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి విచారణ ఎదుర్కుంటున్నారు. ఈ కేసు విచారణలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ తీహాడ్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుతో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శల పాలయ్యేలా చేసింది.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అమానతుల్లా ఖాన్ వంటి ఇతర నేతలపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి ఆరోపణలు ఆ పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. ఈ అవినీతి ఆరోపణలనే బీజేపి ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా వాడుకుని విజయం సాధించింది.

4) కేజ్రీవాల్‌కు బెడిసికొట్టిన ఉచిత హామీ

ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే మహిళల బ్యాంక్ ఖాతాల్లో నెలనెల రూ. 2100 డిపాజిట్ చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అయితే, గతంలో కూడా ఇలాగే రూ. 1000 ఇస్తామని హామీ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆ మాట నిలబెట్టుకోలేదనే ఆరోపణలున్నాయి.

మరోవైపు బీజేపి కూడా మహిళా సమృద్ధి యోజన పథకం పేరుతో మహిళల ఖాతాల్లో రూ. 2500 జమ చేస్తామని హామీ ఇచ్చింది. గతంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల్లో లాడ్లీ బెహన్ యోజన, లడ్కీ బెహిన్ పథకాలతో బీజేపి ఇదే రకమైన హామీని ఇచ్చింది. హామీ ఇవ్వడమే కాకుండా ఆ రెండు రాష్ట్రాల్లో ఆ పథకాలను అమలు చేసి చూపించింది. దీంతో ఈసారి ఢిల్లీలోని మహిళా ఓటర్లు కూడా బీజేపి వైపే మొగ్గు చూపించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

5) బీజేపికి కలిసొచ్చిన ఇండియా బ్లాక్‌ చీలిక

2024 లోక్ సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా బ్లాక్ కూటమిలో కలిసే ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలిచారు. కేజ్రీవాల్‌ను విడుదల చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు విడిపోయాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాల పాత్రే కీలకం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. మరోవైపు అసలు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉండి తప్పు చేశామని ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ వీళ్లే పరస్పర ఆరోపణలు చేసుకోవడం బీజేపికి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News