Rajasthan Political Crisis: సమసిన వివాదం.. అశోక్ గేహ్లోట్, సచిన్ ఫైలట్ కలయిక

Rajasthan Political Crisis: రాజస్థాన్ అధికార పక్షంలో రేగిన వివాదం ముగిసినట్టే కనిపిస్తోంది.

Update: 2020-08-13 15:26 GMT
Ashok Gehlot and Sachin Pilot

Rajasthan Political Crisis: రాజస్థాన్ అధికార పక్షంలో రేగిన వివాదం ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ రోజు జరిగిన శాసనసభా పక్షానికి ఇద్దరు ఏకమై అందరికీ అభివాదం చేస్తూ కలిసి కూర్చుని పార్టీ సభ్యులకు కలయిక సందేశం ఇచ్చారు. అయితే రానున్న సమావేశాల్లో బీజేపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై తీసుకోవాల్సిన వ్యూహంపై చర్చించారు.

కాం‍గ్రెస్‌ పార్టీ అగ్ర నాయకత్వంతో సంప్రదింపుల అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరిన తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గేహ్లోట్ ను గురువారం ఆయన నివాసంలో కలిశారు. పైలట్‌తిరుగుబాటుతో రాజస్తాన్‌లో నెల రోజులు పైగా రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశానికి సచిన్‌ పైలట్‌ హాజరయ్యారు. పైలట్‌ను సాదరంగా ఆహ్వానించిన గహ్లోత్‌ చిరునవ్వులు చిందిస్తూ యువనేతతో కరచాలనం చేశారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పక్కపక్కనే కూర్చున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో గేహ్లోట్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ వెల్లడించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, పైలట్‌ సహా ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాధ్రాలతో సంప్రదింపుల అనంతరం పైలట్‌ సొంతగూటికి తిరిగివచ్చేందుకు అంగీకరించిన సంగతి తెలసిందే. పైలట్‌ పార్టీ ముందుంచిన ప్రధాన డిమాండ్లనూ నెరవేర్చుతామని హైకమాండ్‌ ఆయనకు హామీ ఇచ్చింది. రెబెల్‌ నేతలు తిరిగి పార్టీలోకి రావడంతో వారిని మన్నించి ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కోరారు. మరోవైపు రాజస్తాన్‌లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం రాజస్తాన్‌కు పంపింది. 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్‌ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్‌ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు.


Tags:    

Similar News