Love Affair: కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు లవ్ అఫైర్స్ వల్లే ..మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Love Affair: రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పట్ల ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రవేశ, పోటీ పరీక్షల కోచింగ్ హబ్ గా ఉన్న రాజస్థాన్ లోని కోటాలో ప్రతి ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిగ్గా మారింది.
తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని..చదువు కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దని మంత్రి కోరారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉండాలి అన్నారు. ప్రతి విద్యార్థికి కొన్ని రంగాలపై ఆసక్తి ఉంటుంది..దానికి వ్యతిరేకంగా వారి లక్ష్యాలను బలవంతంగా నిర్దేశించినప్పుడే వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని మంత్రి తెలిపారు.
కాగా కోటాలో జేఈఈకి కోచింగ్ తీసుకుంటున్న 16ఏళ్ల మనన్ జైన్ శనివారం సూసైడ్ చేసుకున్నాడు. మూడేళ్లుగా కోటాలో ఉంటూ జేఈఈ మెయిన్ కు ట్రైనింగ్ తీసుకుంటున్న మనన్ జైన్ తెలివైన వాడని కుటుంబ సభ్యులు తెలిపారు.