తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. విజయ్ తాజాగా తమిళనాడులో రాజకీయ పార్టీ ప్రారంభించడంతో, ఈ సినిమా వాయిదా అంశం రాజకీయంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘జననాయగన్’ సినిమాను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతిపై దాడి చేయడమే అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విషయంపై రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, కేంద్ర సమాచార, ప్రసార శాఖ తమిళ సంస్కృతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘‘మోదీ గారు.. తమిళ ప్రజలను అణచివేయాలనే మీ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు’’ అని ఆయన ట్వీట్ చేశారు. గత వారం విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ చిక్కుల కారణంగా వాయిదా పడింది. దీనిపై కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరగనుంది.