Retail Inflation India: మళ్లీ ధరల సెగ షురూ..కొనలేము..తినలేమా?

Retail Inflation India: మళ్లీ ధరల సెగ షురూ..కొనలేము..తినలేమా?

Update: 2026-01-13 01:20 GMT

Retail Inflation India: దేశవ్యాప్తంగా ధరల ఒత్తిడి మళ్లీ కనిపించడం ప్రారంభమైంది. డిసెంబరు 2025లో రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. గత నెలలో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 1.33 శాతంగా నమోదైంది. నవంబరు 2025లో ఇది 0.71 శాతంగా ఉండగా, ఒక్క నెలలోనే 0.62 శాతం పెరిగింది. అయితే డిసెంబరు 2024లో నమోదైన 5.22 శాతంతో పోలిస్తే ప్రస్తుత ద్రవ్యోల్బణం 3.89 శాతం తక్కువగా ఉంది.

డిసెంబరు నెలలో ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసాహారం, చేపలు, గుడ్లు, మసాలా దినుసులు, పప్పుదినుసుల ధరలు పెరగడం నిలిచిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. వీటి ధరలు పెరగడంతో మూడు నెలల తర్వాత మళ్లీ ద్రవ్యోల్బణం ఊపందుకుంది. అయినప్పటికీ, ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లక్ష్య పరిధిలోని రెండు శాతం కనిష్ఠ స్థాయికి దిగువగానే ఉండటం గమనార్హం. వరుసగా నాలుగో నెల కూడా రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం కంటే తక్కువగానే కొనసాగింది.

రాష్ట్రాల వారీగా చూస్తే, కొన్ని రాష్ట్రాల్లో ధరల సెగ స్పష్టంగా కనిపించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఐదు రాష్ట్రాల్లో డిసెంబరు నెలలో ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదైంది. కేరళలో అత్యధికంగా 9.49 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకాగా, కర్ణాటకలో 2.99 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 2.71 శాతం, తమిళనాడులో 2.67 శాతం, జమ్మూకశ్మీర్‌లో 2.26 శాతం చొప్పున నమోదయ్యాయి.

ఇదే సమయంలో అసోం, బిహార్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ధరల పెరుగుదల కనిపించలేదు. ఈ రాష్ట్రాల్లో డిసెంబరు నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం మైనస్‌లో నమోదైనట్లు ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ధరల ఒత్తిడి పరిమితంగానే ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వినియోగదారులకు భారంగా మారుతోందని గణాంకాలు సూచిస్తున్నాయి.

Tags:    

Similar News