నిజాయతీకి నోబెల్ కావాలి… చెత్తలో దొరికిన రూ.45 లక్షల బంగారం అప్పగించిన కార్మికురాలు
Tamil Nadu: చెన్నైలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు తన నిజాయతీతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
Tamil Nadu: చెన్నైలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు తన నిజాయతీతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షల విలువైన బంగారు నగలను పోలీసులకు అప్పగించి ఆమె ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలోని టీనగర్ ప్రాంతంలో పద్మ అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె యధావిధిగా విధుల్లో భాగంగా చెత్తను సేకరిస్తుండగా, రోడ్డుపై పడి ఉన్న ఒక బ్యాగు ఆమె కంటపడింది. కుతూహలంతో ఆ బ్యాగును తెరిచి చూడగా, అందులో భారీగా బంగారు ఆభరణాలు కనిపించాయి.
సాధారణంగా అంత పెద్ద మొత్తంలో బంగారం కనిపిస్తే ఎవరైనా తడబడతారు, కానీ పద్మ మాత్రం ఏమాత్రం తడుముకోకుండా వెంటనే ఆ బ్యాగును తీసుకుని పాండిబజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులకు నగలను అప్పగించి జరిగిన విషయం వివరించారు. ఆ బ్యాగులో సుమారు 45 సవర్ల (360 గ్రాములు) బంగారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు, దీని విలువ మార్కెట్‌లో రూ.45 లక్షల వరకు ఉంటుంది.
పోలీసుల దర్యాప్తులో ఆ నగలు నంగనల్లూర్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తివిగా తేలింది. రమేష్ బ్యాంకు వేలంలో నగలను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. వేలంలో దక్కించుకున్న నగలతో వెళ్తుండగా, టీనగర్ వద్ద పొరపాటున ఆ బ్యాగును జారవిడుచుకున్నారు. నగలు పోయాయని ఆయన అప్పటికే పాండిబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నారు.
పోలీసులు రమేష్‌ను పిలిపించి పద్మ సమక్షంలోనే ఆ నగలను ఆయనకు అందజేశారు. తన కష్టార్జితాన్ని తిరిగి అప్పగించిన పద్మ నిజాయతీని చూసి రమేష్ భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.