Modi:దేశ భవిష్యత్తుకు జెన్-జెడ్ శక్తే ఆధారం: ప్రధాని మోదీ
Modi:దేశ భవిష్యత్తుకు జెన్-జెడ్ శక్తే ఆధారం: ప్రధాని మోదీ
Modi: దేశ యువతపై తనకు ఎప్పుడూ అపారమైన విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పటి నుంచీ, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నా యువత సామర్థ్యంపై తన నమ్మకం ఏమాత్రం తగ్గలేదని తెలిపారు. ముఖ్యంగా జెన్-జెడ్ తరం సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు, ఉత్సాహంతో దేశాన్ని ముందుకు నడిపించే శక్తిగా ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు.
‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. స్వామి వివేకానందుడి జీవితం, ఆయన బోధనల నుంచి స్ఫూర్తి పొందే ఈ వేదికను యువత కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, ఆ బాధ్యతను జెన్-జెడ్ తరం ధైర్యంగా స్వీకరిస్తోందని అన్నారు.
గత పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం యువతను కేంద్రంగా చేసుకుని అనేక విధానాలు, పథకాలను అమలు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఈ చర్యల వల్లే దేశంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరించిందని చెప్పారు. ఒకప్పుడు ప్రారంభమైన సంస్కరణల ప్రయాణం ఇప్పుడు ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’గా మారిందని, ఆ ప్రయాణానికి ఇంజిన్‌లా పనిచేస్తున్నది యువతేనని స్పష్టం చేశారు.
యువత, ప్రభుత్వానికి మధ్య మరింత బలమైన భాగస్వామ్యం ఏర్పడాలనే ఉద్దేశంతో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ వేదికను రూపొందించామని మోదీ తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా యువత చురుకుగా పాల్గొనడం తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. జెన్-జెడ్ శక్తిని సద్వినియోగం చేసుకుంటే భారత్ అభివృద్ధి లక్ష్యాలను మరింత వేగంగా చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.