బికనీర్‌లో ఘోరం: కళాశాల విద్యార్థినిపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

Update: 2026-01-13 05:29 GMT

Gang Rape: రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కళాశాలకు వెళ్తున్న ఓ యువతిపై ఇద్దరు దుండగులు కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 6వ తేదీన బాధిత యువతి తన ఇంటి నుంచి కళాశాలకు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. మార్గమధ్యలో ఇద్దరు యువకులు యువతిని అడ్డగించి, బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు.

నిందితులు ఆమెను నాపసర్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. కొన్ని గంటల పాటు కదులుతున్న కారులోనే ఆమెపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితులు యువతిని కారులో తీసుకెళ్తుండగా, ఒక గ్రామంలో వారి కదలికలను గమనించిన స్థానికులకు అనుమానం వచ్చింది. గ్రామస్థులు కారును ఆపే ప్రయత్నం చేయడంతో, భయాందోళనకు గురైన నిందితులు యువతిని కారులో నుంచి కిందకు తోసేసి అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. వెంటనే గ్రామస్థులు బాధిత యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో, జనవరి 11న ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News