PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ పంట సాయం రూ. 10వేలకు పెంపు? ఫిబ్రవరి 1న ప్రకటన..!!

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ పంట సాయం రూ. 10వేలకు పెంపు? ఫిబ్రవరి 1న ప్రకటన..!!

Update: 2025-12-30 08:02 GMT

PM Kisan: దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన పథకాలలో ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. సాగు ప్రారంభ దశలో అవసరమైన పెట్టుబడికి తోడ్పడటం.. అప్పుల భారాన్ని కొంతవరకు తగ్గించడం ఈ పథకానికి ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్కీమ్ ద్వారా రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు సాయం అందించడం జరుగుతోంది.

ప్రస్తుతం ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా.. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా విడుదల చేస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో డబ్బులు జమ కావడంతో మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతుండటం ఈ పథకానికి ప్రధాన బలం.

2019లో ప్రారంభమైన ఈ పథకం నుంచి ఇప్పటివరకు రైతులకు అదే స్థాయిలో పెట్టుబడి సాయం కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 21 విడతలుగా రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున నగదు జమ చేశారు. అయితే పెరుగుతున్న సాగు ఖర్చులు, ఎరువులు, విత్తనాలు, కూలీ ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే ఈ మొత్తం సరిపోవడం లేదనే అభిప్రాయం రైతుల్లో బలంగా వినిపిస్తోంది. అందుకే పీఎం కిసాన్ కింద అందిస్తున్న నగదు సాయాన్ని పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది.

ప్రతిసారి కేంద్ర బడ్జెట్ సమయం దగ్గరపడగానే రైతులు ఈ పథకం పెంపుపై ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే గత కొన్ని బడ్జెట్‌ల్లో పీఎం కిసాన్ నగదు సాయంపై ఎలాంటి పెంపు ప్రకటనలు లేకపోవడంతో నిరాశే ఎదురవుతోంది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా..లేక రైతులకు ఊరట కలిగించే నిర్ణయం వస్తుందా అనే అంశంపై చర్చ సాగుతోంది. నగదు సాయం పెంపుతో పాటు పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంపుపై కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈసారి మరింత ప్రాధాన్యం ఇస్తారేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. గత ఏడాది నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. సాధారణ షెడ్యూల్ ప్రకారం చూస్తే, 22వ విడత నిధులు మార్చి–ఏప్రిల్ మధ్య రైతుల ఖాతాల్లోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో పీఎం కిసాన్ నగదు సాయాన్ని పెంచే నిర్ణయం తీసుకుంటే, రాబోయే 22వ విడత నుంచే రైతులు ఎక్కువ మొత్తాన్ని అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. అందుకే ఈ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News