నేటి నుంచి రెండు దఫాలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Update: 2020-01-31 02:01 GMT

నేటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి (జనవరి 31) నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సెషన్ జరగనుంది. రెండు విడతలుగా సమావేశాలు జరగనున్నాయి. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహిస్తారు. ఆనవాయితీ ప్రకారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం అనంతరం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతాయి. తొలిదశలో 12 రోజులపాటు సాగే ఈ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే పద్దును కూడా కలిపి దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా నిన్న(జనవరి 30) అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన సమావేశానికి అన్ని పార్టీల లోక్ సభా పక్ష నేతలు హాజరయ్యారు.. ఈ సందర్బంగా సమావేశాలు సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పార్టీల ప్రతినిధుల్ని కోరారు. అంతకంటే ముందు పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, థావర్‌ చంద్‌ గెహ్లాట్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, వి.మురళీధరన్‌, రామ్‌దాస్‌ అథ్వాలే, కాంగ్రెస్‌ నేతలు అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మలతోపాటు టికె రంగరాజన్‌, పిఆర్‌ నటరాజన్‌ (సిపిఎం), టిఆర్‌ బాలు, తిరుచ్చి శివ (డిఎంకె), సుదీప్‌ బందోపాధ్యాయ, డెరిక్‌ ఒబ్రెయిన్‌ (టిఎంసి), విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి (వైసిపి), పినాకి మిశ్రా, ప్రసన్న ఆచార్య (బిజెడి), సతీష్‌ చంద్ర మిశ్రా, రితేష్‌ పాడ్య (బిఎస్‌పి),

సుప్రియా సులే (ఎన్‌సిపి), రామ్‌ గోపాల్‌ యాదవ్‌ (ఎస్‌పి), కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (టిఆర్‌ఎస్‌), గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌ (టిడిపి), బినరు విశ్వం (సిపిఐ), నవనీత్‌ క్రిష్ణన్‌, రవీంద్రనాథ్‌ కుమార్‌ (అన్నాడిఎంకె), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌ (ఆర్‌ఎస్‌పి) తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే బడ్జెట్ సమావేశాల అజెండా, చర్చించాల్సిన బిల్లులపై సమాలోచనలు జరిపారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేక ఆందోళనలు, దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం దృష్ట్యా బడ్జెట్‌ సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. 

Tags:    

Similar News