Trains From Prayagraj: మహాశివరాత్రి స్పెషల్.. మహాశివరాత్రి వేళ భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ నుంచి 350 పైగా రైళ్లు
Trains From Prayagraj On Maha Shivaratri: కుంభమేళాలో భాగంగా మహాశివరాత్రి రోజు చివరి స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. దీంతో యూపీ సహా పొరుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కోట్లాది మంది భక్తులు తమ స్వస్థలాలకు తిరుముఖం పడతారు. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ ప్రయాగ్ రాజ్ నుంచి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 350కిపైగా రైళ్లను నడిపించేందుకు సిద్ధమైంది.
మౌని అమావాస్య మాదిరిగానే మహాశివరాత్రి రోజున భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలిరానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య నాడు 360రైళ్లను నడిపించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఆ రోజు 20లక్షల మంది యాత్రికులను స్వస్థలాలను సురక్షితంగా చేరవేసినట్లు పేర్కొంది. ఇదే విధంగా మహాశివరాత్రి రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అవసరం అయితే వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక బోగీలను ప్రయాగ్ రాజ్ సమీపంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. అంతేకాదు ప్రయాగ్ రాజ్ రీజియన్లలోని అన్ని స్టేషన్లో 1500 మంది రైల్వే ఉద్యోగులు, 3000 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని విధుల్లో ఉంచినట్లు వెల్లడించింది.
జనవరి 13న మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. మొత్తంగా ఈ 45 రోజులపాటు సాగే మహాకుంభమేళాకు 13,500రైలు సర్వీసులను నడపాలని రైల్వే శాఖ తొలత ప్రణాళికులు వేసుకుంది. కానీ 42 రోజులకు ప్రత్యేక రైళ్లు కలిపి ఏకంగా 15000 సర్వీసులను నడిపినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే శాఖ ప్రకారం గడిచిన 2 రోజులుగా ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తులతో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంది. మహాశివరాత్రి నేపథ్యంలో అమ్రుతస్నానం అనంతరం భారీ సంఖ్యలో భక్తులు తిరిగి స్వస్థలాలకు వెళ్తారు. కాబట్టి భక్తులతో, యాత్రికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. వీటిని ద్రుష్టిలో ఉంచుకుని నార్త్ సెంట్రల్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్తర్న్ రైల్వేలు విస్త్రుత ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతేకాదు అధికారులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓలు వీటన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు.