Assam Dispute: అస్సాం- మిజోరం సరిహద్దులో కొనసాగుతున్న వివాదం

Assam Dispute: ఇరు రాష్ట్రాల సీఎం మధ్య మాటల వార్ * పొరుగు రాష్ట్రం కేసుపై ఏ విచారణకైనా సిద్ధం: హిమంత

Update: 2021-08-01 06:54 GMT

అస్సాం మిజోరాం బోర్డర్ వద్ద కొనసాగుతున్న వివాదం (ఫైల్ ఇమేజ్)

Assam Dispute: అస్సాం- మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఇరు రాష్ట్రల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతం మరోసారి నివురుగప్పిన నిప్పులా మారింది. ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు విష‍యమై ఉన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా అస్సాం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అస్సాం- నాగాలాండ్ సరిహద్దులో నెలకొన్న వివాదం పరిష్కారానికి రెండు ప్రభుత్వాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. వివాదాస్పద ప్రాంతాల్లోని ఇరు రాష్ట్రాల సాయుధ పోలీసులను తక్షణం ఉపసంహరించుకుని.. ఆయా శిబిరాలకు తరలించాలని నిర్ణయించారు.

ఈ ఒప్పందం ప్రకారం దెస్సొయ్ లోయ అభయారణ్యంలోని వివాదాస్పద స్థలాల్లోని సాయుధ పోలీసులను 24 గంటల్లో పూర్తిగా ఉపసంహిరిస్తారు. అనంతరం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్‌ల ద్వారా, ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా యథాతథస్థితిని కొనసాగించేందుకు కృషి చేస్తాయని అధికారులు ప్రకటించారు. ఈ ఒప్పందంపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తం చేశారు. నాగాలాండ్ సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.

మిజోరంలో తనపై కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలపై బిశ్వశర్మ స్పందించారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అసోం సీఎం తెలిపారు. అదే సమయంలో రాజ్యాంగ పరంగా అస్సాం భూభాగంలో జరిగిన ఘర్షణపై విచారణను తటస్థ సంస్థకు ఎందుకు అప్పజెప్పడం లేదని ట్విటర్ వేదిగా ప్రశ్నించారు. మిజోరం జీవనాడి అయిన 306 నెంబర్ నేషనల్ హైవే దిగ్బంధంలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జులై 26 నుంచి అస్సాం నుంచి ఒక్క ట్రక్కు కూడా రాష్ట్రంలోకి రాలేదని మిజోరం అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News