6 నెలలు నీట మునిగే శివాలయం... శివుడే తపస్సు చేసుకునే మందిరం

Nilkantheshwar Mahadev Temple: ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే... సంవత్సరంలో 6 నెలలు నీళ్లలో మునిగితే మరో 6 నెలలు..

Update: 2025-02-26 01:30 GMT

6 నెలలు నీట మునిగే శివాలయం... శివుడే తపస్సు చేసుకునే మందిరం

Nilkantheshwar Mahadev Temple: శివాలయాలన్నీ శివుడు కొలువై ఉన్న మందిరాలే అయినప్పటికీ కొన్ని శివాలయాలకు మాత్రం చెప్పుకోదగిన ప్రత్యేకతలు ఎన్నో ఉంటాయి. అలాంటి శివాలయాలలో ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ శివాలయం కూడా ఒకటి. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే... సంవత్సరంలో ఆరు నెలలు నీళ్లలో మునిగితే మరో 6 నెలలు నీటి బయట ఉంటుంది. ఇది దాదాపు ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే తంతు. శివ భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ గుడి ఎక్కడుందనేది ఇప్పుడు చూసొచ్చేద్దాం రండి.

Full View

నీలకంఠేశ్వర్ మహదేవ్ ఆలయం

అది నీలకంఠేశ్వర్ మహదేవ్ ఆలయం. గుజరాత్‌లోని నర్మదా నది తీరంలో సత్పురా పర్వతాల మధ్య జునారాజ్ ప్రాంతంలో ఈ శివాలయం ఉంది. వర్షాకాలం నుండి ఈ గుడి పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఆ తరువాత 6 నెలలకు గుడి మళ్లీ బయటికి కనిపిస్తుంది. నర్మదా నదిపై నిర్మించిన కర్జన్ డ్యామ్ క్యాచ్‌మెంట్ ఏరియాలోకి భారీగా వరద నీరు ఉప్పొంగి రావడమే అందుకు కారణం. ఎండా కాలం ఆరంభం అవుతుండగా క్యాచ్‌మెంట్ ఏరియాలో నీరు తగ్గి గుడి బయటికి కనిపిస్తుంది. తరతరాలుగా ఒక్క సంవత్సరం కూడా మిస్ అవకుండా ఇలాగే జరుగుతుండటంతో ఇది ఆ దైవ మహిమే అనేది స్థానికుల విశ్వాసం.

ధ్యానముద్రలో శివుడు

సాక్షాత్ శివుడే వెలిసినట్లుగా స్థానికులు చెప్పుకునే ఈ మందిరంలో శివుడి మూలవిరాట్ కూడా ధ్యానంలో ఉన్న శివుడి విగ్రహమే దర్శనమిస్తుంది. అందుకే శివాలయం నీట మునిగినన్ని రోజులు సాక్షాత్తుగా ఆ పరమ శివుడే కైలాసం నుండి దిగొచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటాడనేది భక్తుల విశ్వాసం. నీరు తగ్గి శివాలయం కనిపిస్తోందంటే... ఆ శివుడి ధ్యానం ముగిసిందనేది ఇక్కడి విశ్వాసం.

శివాలయం కొద్దిగాకొద్దిగా కనిపిస్తున్నప్పటి నుండే ఇక్కడికి భక్తుల తాకిడి పెరుగుతుంది. శివాలయం నీట మునిగినప్పుడు కూడా బోట్లలో వెళ్లి దూరం నుండి ఆలయాన్ని దర్శించుకుని వస్తుంటారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ బోట్లు దిగి ఈత కొట్టకూడదనే నియమం కూడా ఉంది. ఎందుకంటే నర్మదా నదిపై నిర్మించిన ఈ కర్జన్ డ్యామ్‌లో మొసళ్లకు కొదువేం లేదు. అందుకే ఈ నీటిలో ఈతకొట్టే దుస్సాహసం చేయకూడదు.

సూర్యుడు అస్తమించే సమయంలో సూర్యుడి కిరణాలు నీటిపై పడటంతో నీరంతా పసిడి వర్ణంలోకి మారిపోతుంది. చూడ్డానికి ఆ దృశ్యం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అందుకే సాయంత్రం సూర్యస్తమయం వేళలో ఈ గుడిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

సుమారు 500 ఏళ్ల క్రితం రాజ్‌పుత్ వంశానికి చెందిన చౌక్రానా రాజు ఈ నీలకంఠేశ్వర్ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు అక్కడి చరిత్ర చెబుతోంది. గుజరాత్‌లోనే ఇలా ప్రతీ సంవత్సరం నీట ముగినే దేవాలయాలు మరో రెండు ఉన్నాయి. అందులో ఒకటి స్తంభేశ్వర్ మహదేవ్ టెంపుల్ కాగా నిష్కలంక్ మహదేవ్ టెంపుల్ మరొకటి. కైంబే పట్టణానికి సమీపంలో అరేబియా సముద్రం ఒడ్డున స్తంభేశ్వర్ మహదేవ్ టెంపుల్ ఉంది. భావ్ నగర్‌లో నిష్కలంక్ మహదేవ్ ఆలయం ఉంది. ఈ రెండు శివాలయాలకు కూడా శివభక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. 

ALSO WATCH THIS VIDEO: New York Grand Central Railway Station: 48 ఎకరాల మాయా ప్రపంచం

Full View

Tags:    

Similar News