New Zealand: భారత్ ప్రయాణీకులకు నో ఎంట్రీ అంటోన్న న్యూజిలాండ్

New Zealand: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-04-08 06:13 GMT

Jacinda Ardern: (Photo: The Hans India)

New Zealand: భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులను తమ దేశంలోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇండియాలో వుంటున్న న్యూజిలాండ్ వాసులకు కూడా ఇది వర్తిస్తుందని, ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

జెసిండా ఆర్డెర్న్‌ తెలిపిన వివరాల ప్రకారం ''భారత్‌ నుంచి ప్రయాణికులెవరూ న్యూజిలాండ్‌లోకి రాకుండా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఏప్రిల్‌ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్‌ 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ప్రయాణికుల రాకపై తాత్కాలిక నిషేధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను మేం అర్థం చేసుకోగలం. కానీ, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'' అని జెసిండా వివరించారు. అవసరమైతే నిషేధాన్ని మరింత కాలం పొడగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్‌ సరిహద్దుల్లో పనిచేసే సిబ్బందిలో ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతేగాక, ఇటీవల విదేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించగా.. అందులో 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా.. వీరిలో 17 మంది భారత్‌ నుంచి వచ్చినవారే కావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా సరిహద్దుల్లోనే వైరస్‌ను అడ్డుకునేలా న్యూజిలాండ్‌ కఠిన చర్యలు చేపడుతోంది. గత 40 రోజులుగా అక్కడ ఎలాంటి సామాజిక వ్యాప్తి కేసులు నమోదు కాకపోవడం కొసమెరుపు.

Tags:    

Similar News