ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం

*రేపు రోడ్ల దిగ్బంధానికి రైతులు పిలుపు *దేశవ్యాప్తంగా రేపు జాతీయ రహదారుల దిగ్బంధం *మధ్యాహ్నం 12నుంచి 3గంటల వరకు నిరసన

Update: 2021-02-05 14:34 GMT

రైతుల నిరసనలు ఫైల్ ఫోటో 

ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. రేపు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధానికి రైతులు పిలుపునివ్వడంతో పెద్దఎత్తున నిరసనలు తెలిపేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. సమీప రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు భారీగా రైతులు తరలివస్తున్నారు. దాంతో ఢిల్లీ సరిహద్దులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు జాతీయ రహదారులపై నిరసనలు తెలపనున్నట్లు రైతులు ప్రకటించారు.చక్కా జామ్‌ పేరుతో నిర్వహించే జాతీయ రహదారుల దిగ్బంధంలో అన్నదాతల కష్టాలను వాహనదారులకు వివరిస్తామని రైతు సంఘాలు తెలిపాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు జరగనున్న నష్టాన్ని ప్రజలకు చెబుతామన్నారు.

మరోవైపు, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో రగడకు సమాధానం చెప్పాలని నిర్ణయించిన మోడీ.... అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ , ప్రహ్లాద్ జోషీ తదితరులు హాజరయ్యారు. అయితే, వ్యవసాయ చట్టాలపై జరుగుతోన్న రగడపై సోమవారం రాజ్యసభలో ప్రధాని మాట్లాడతారని తెలుస్తోంది. రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయనే భావనలో ఉన్న మోడీ ప్రభుత్వం.... గట్టిగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇక, రేపు రహదారుల దిగ్బంధానికి రైతులు పిలుపునిచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని మోడీ చర్చించారు. ఢిల్లీ సరిహద్దుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News