Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరిలో వైట్ హౌస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వచ్చేనెలలో తాను మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తో భారత ప్రధాని మోదీ సోమవారం ఫోన్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పారు.
సోమవారం ఉదయం మోదీతో సుదీర్ఘంగా మాట్లాడాను . భారత్ తో మనకు మంచి అనుబంధం ఉంది. బహుశా వచ్చే నెలలో ఆ దేశ ప్రధాని వైట్ హౌస్ వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఈ సందర్భంగా అక్రమ వలసదారుల అంశం గురించి మోదీతో తాను చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నాను అని ట్రంప్ తెలిపారు.
తొలిసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ట్రంప్ తన చివరి విదేశీ పర్యటన భారత్ లోనే చేపట్టిన సంగతి తెలిసిందే. 2020లో అహ్మదాబాద్ కు విచ్చేసి మోదీతో కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతుకుముందు 2019 సెప్టెంబర్ లో వీరిద్దరూ హ్యూస్టన్ లోని ర్యాలీలో ప్రసంగించారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తో మోదీ నిన్న ఫోన్లో మాట్లాడారు. రెండు దేశాల సంబంధాలను పైకి తీసుకువెళ్లడంపై వారు చర్చించుకున్నారు. పరస్పర ప్రయోజనం కలిగించే అంశాలను విశ్వసనీయ భాగస్వామ్యానికి ఇరు పక్షాలూ కట్టుబడి ఉన్నాయని మోదీ ఎక్స్ లో తెలిపారు.